TG Rythu Bharosa Scheme : 'రైతు భరోసా'కు దరఖాస్తు చేసుకోవాలా..? విధానాలేంటి..? ముఖ్యమైన 10 విషయాలివే
Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ పై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. సాగుకు యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించేదే లేదని స్పష్టం చేసింది. ఏడాదికి రూ. 12 వేల సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ పలు కీలక విషయాలకు ఆమోదముద్ర వేసింది.
పంట పెట్టుబడి సాయంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసా పేరుతో అమలు చేసే ఈ స్కీమ్ కు సంబంధించిన పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఏడాదికి రూ. 12వేల సాయం అందించేందుకు సిద్ధమైంది. అయితే వ్యవసాయ యోగ్యం లేని భూములకు మాత్రం... రైతు భరోసా అందించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కేబినెట్ లో జరిగిన వివివరాలను వెల్లడించారు.
రైతు భరోసా స్కీమ్ ఏంటి..?
గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున... ఏడాదికి రూ. 10వేలు ఇచ్చేది. అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ. 15వేల పంట పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. రైతుబంధు పేరును కాకుండా.. రైతు భరోసా పేరుతో పంట పెట్టుబడి సాయం అందించనుంది. అయితే ఎకరానికి రూ. 15వేలు కాకుండా.. రూ. 12 వేల సాయం అందించాలని నిర్ణయించింది.
రైతు భరోసా స్కీమ్ - 6 ముఖ్యమైన అంశాలు:
- పంట పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్ రైతు భరోసా. ఈ స్కీమ్ కింద.. రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తారు.
- రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందిస్తారు. ఇదే విషయాన్ని కేబినెట్ భేటీ తర్వాత… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయించారు.
- గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఇచ్చింది. అయితే రైతు భరోసా కింద ఎడాదికి రూ. 12 వేలు ఇస్తారు.
- వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు.
- వ్యవసాయ యోగ్యంకాను భూముల వివరాలకు సంబంధించి... రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరిస్తారు. ధరణి లోపాల కారణంగా గతంలో కొంతమందికి ఆ రకంగా కూడా రైతు బంధు కింద నిధులు అందాయి. ఇలాంటి భూములకు చెక్ పెట్టేలా.. తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యమైన భూమికే ఇవ్వాలని నిర్ణయించినందున మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చింది.
- రైతు భరోసా స్కీమ్ ను జనవరి 26, 2025 నుంచి ప్రారంభిస్తారు.
- రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచిన నేపథ్యంలో… ఎకరా చొప్పున ప్రతి రైతు ఖాతాలో రూ. 6వేలు జమ అవుతాయి. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద కింద రెండుసార్లు పంట పెట్టుబడి సాయం అందుతుంది.
- భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా" నామకరణం చేశారు.
- రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని బీఆర్ఎస్ గుర్తు చేసింది. కేవలం రూ. 12000 వేలు ఇస్తామని చెప్పటాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. క్యాబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులను రేవంత్ సర్కార్ దారుణంగా దగా చేసిందని ఆరోపిస్తోంది.
సంబంధిత కథనం