YS Sharmila : పాలేరులో ఏ గుర్తుపై షర్మిల పోటీ..? డైలామాలో 'హస్తం' కేడర్-which party symbol will ys sharmila contest from paleru ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila : పాలేరులో ఏ గుర్తుపై షర్మిల పోటీ..? డైలామాలో 'హస్తం' కేడర్

YS Sharmila : పాలేరులో ఏ గుర్తుపై షర్మిల పోటీ..? డైలామాలో 'హస్తం' కేడర్

Mahendra Maheshwaram HT Telugu
Aug 31, 2023 03:19 PM IST

Telangana Assembly Elections: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ షర్మిల రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. అయితే ఆమె ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది.

వైెఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)
వైెఎస్ షర్మిల (ఫైల్ ఫొటో)

Palair Assembly Constituency: వైఎస్ షర్మిల..…. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఏపీలోనూ వైసీపీ తరపున ఓ రేంజ్ లో ప్రచారం చేసిన ఆమె...అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేశారు. ఏకంగా ఓ పార్టీనే స్థాపించి.. కేసీఆర్ పై యుద్ధం ప్రకటించారు. అంతేనా సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. రాజ్యన్న రాజ్యం తీసుకురావడమే లక్షమ్యని చెబుతూ వచ్చిన షర్మిల.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటన కూడా చేశారు. కట్ చేస్తే… గత కొద్దిరోజులుగా షర్మిల రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ లోని కీలక నేతలతో టచ్ లోకి వెళ్తున్న షర్మిల… తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటిని చూస్తే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… కాంగ్రెస్ లో విలీనం తప్పదా? లేక పొత్తు ఉంటుందా…? అన్న చర్చ జోరందుకుంది.

విలీనంపై వార్తలు…?

కర్ణాటక ఫలితాల తర్వాత డీకే శివ కుమార్ తో భేటీ అయ్యారు షర్మిల. అప్పట్నుంచి వైఎస్ఆర్టీపీ విలీనంపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు వైఎస్ షర్మిల. విలీనం చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే గత కొంతకాలంగా కాంగ్రెస్ లోని కీలక నేతలతో షర్మిల టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆగష్టు 11న రాహుల్‌ గాంధీతో కూడా షర్మిల భేటీ అయ్యారు. అంతకు ముందు రెండు సార్లు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె.శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ప్రచారం మొదలైంది. వాటిని ఆమె తోసిపుచ్చినా ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోందితాజాగా ఢిల్లీకి వెళ్లిన షర్మిల… సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల… చాలా విస్తృతంగా తమ చర్చలు జరిగినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైందని కామెంట్స్ చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ విలీనంపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

పాలేరులో పోటీ…?

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. ఈ నేపథ్యంలో నిజంగానే వైఎస్ఆర్టీపీ విలీనం అయితే… షర్మిల ప్రకటన మేరకు పాలేరు నుంచే బరిలో ఉంటారా…? లేక ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా..? అన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఒకవేళ విలీనం జరిగి, ఇదే స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే మాత్రం… కాంగ్రెస్ గుర్తుపై షర్మిల పోటీ చేయాల్సి వస్తుంది. మరోవైపు గత ఎన్నికల్లో ఇక్కడ్నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెెళ్లారు. మరోసారి కూడా ఆయన్నే ఆ పార్టీ తరపున బరిలో ఉండనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల.. కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఆయన కాంగ్రెస్ లోకి వస్తే పాలేరు టికెట్ పై అధినాయకత్వం హామీ ఇచ్చే పరిస్థితి లేదనిపిస్తోంది. షర్మిల పార్టీ విలీనమైతే… కాంగ్రెస్ గుర్తుపై ఆమెనే పోటీ చేయటం ఖాయమనే చర్చ గట్టిగా వినిపిస్తోంది.

మొత్తంగా కాంగ్రెస్ విషయంలో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.విలీనంపై ప్రకటనతో పాటు పోటీ చేసే సీటు విషయంలో కూడా క్లారిటీ ఇస్తే…పాలేరు టికెట్ వ్యవహరం తేలిపోతుంది. ఇక ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో…. పాలేరులోని కాంగ్రెస్ క్యాడర్ డైలామాలో పడిపోయింది. ఓవైపు తుమ్మల.. తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో… వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ తో ఆలోచనలో పడిసినట్లు అయింది. త్వరలోనే అన్ని సందేహాలకు పుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది.