Aramghar Flyover : హైదరాబాద్‌ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌కు ఎన్నో ప్రత్యేకతలు.. ప్రారంభం ఎప్పుడు?-when will the aramghar flyover in hyderabad be inaugurated ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aramghar Flyover : హైదరాబాద్‌ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌కు ఎన్నో ప్రత్యేకతలు.. ప్రారంభం ఎప్పుడు?

Aramghar Flyover : హైదరాబాద్‌ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌కు ఎన్నో ప్రత్యేకతలు.. ప్రారంభం ఎప్పుడు?

Basani Shiva Kumar HT Telugu
Jan 03, 2025 05:07 PM IST

Aramghar Flyover : హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్.. నగరంలోని రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అలాగే దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు.

ఆరాంఘర్ ఫ్లైఓవర్‌
ఆరాంఘర్ ఫ్లైఓవర్‌

హైదరాబాద్‌లోని ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. దీంతో ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే.. ఆరాంఘర్- బహదూర్‌పురా మధ్య ట్రాఫిక్‌ కష్టాలు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

yearly horoscope entry point

ప్రజల ఎదురుచూపులు..

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభం అయితే.. కొన్ని సంవత్సరాలుగా ఉన్న గుంతల రోడ్డు నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. మొదట డిసెంబర్ 3, 2024న ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించాలని అనుకున్న తర్వాత.. వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.

రెండో పొడవైన ఫ్లైఓవర్..

ఈ ఫ్లైఓవర్ 4.04 కిలోమీటర్లు ఉంది. ఇది హైదరాబాద్‌లోని రెండో పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఆరు లేన్లలో దీన్ని నిర్మించారు. రెండు వైపులా రాకపోకలు సాగించవచ్చు. ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన తర్వాత.. హైదరాబాద్‌లోని అనేక కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. ముఖ్యంగా ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివ్రాంపల్లి, హసన్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.

నగర అభివృద్ధికి అద్దం..

ఈ ఫ్లైఓవర్ నిర్మాణం నగర అభివృద్ధికి ఒక నిదర్శనం అని అధికారులు చెబుతున్నారు. ఇది నగరాన్ని ఆధునికంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ)లో భాగంగా నిర్మించారు

Whats_app_banner