హైకోర్టు నుంచి సుప్రీం తీర్పు వరకు..! ‘ఎమ్మెల్యేల ఫిరాయింపు’ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..?-when and what happened in the case of 10 brs mlas defecting from the party in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైకోర్టు నుంచి సుప్రీం తీర్పు వరకు..! ‘ఎమ్మెల్యేల ఫిరాయింపు’ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..?

హైకోర్టు నుంచి సుప్రీం తీర్పు వరకు..! ‘ఎమ్మెల్యేల ఫిరాయింపు’ కేసులో ఎప్పుడు ఏం జరిగింది..?

బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం చేరటంతో… ఇవాళ అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. 3 నెలలలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

పార్టీ ఫిరాయింపుల కేసు - ఎప్పుడు ఏం జరిగింది..?

రాష్ట్రంలోని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీసింది. హైకోర్టులో మొదలైన విచారణపర్వం…. చివరగా సుప్రీంకోర్టు వరకు వచ్చింది. ఇరుపక్షాలతో పాటు తెలంగాణ స్పీకర్ తరపున సుదీర్ఘ వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం… ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. 3 నెలలలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో… ఈ కేసుపై అనేక కోణాల్లో చర్చ మొదలైంది. అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీం సూచించిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే… కోర్టే ఏం చేయబోతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు దాఖలు నుంచి… ఇప్పటివరకు ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి….

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు - ముఖ్యమైన అంశాలు

  • 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగా… బీఆర్ఎస్ 39 స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది. అయితే కొద్ది నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు.
  • పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అరికెపూడీ గాంధీ, కాలె యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు.
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వీరిపై చర్యల కోసం న్యాయపోరాటానికి దిగింది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు… తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు (2024 ఏప్రిల్) దాఖలు చేశారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు.
  • ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. 2024 సెప్టెంబర్ లో స్పీకర్ ఆఫీస్ కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించింది.లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది.
  • అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్‌‌ బెంచ్‌‌ ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్య అప్పీల్‌‌ పిటిషన్ దాఖలు చేశారు.
  • నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. స్పీకర్‌కు టైమ్‌ బాండ్‌ లేదని ధర్మాసనం పేర్కొంది. పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.
  • హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై జనవరి 2025లో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు.వీరి పిటిషన్లపై ఫిబ్రవరిలో విచారించిన కోర్టు… ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది.రీజనబుల్‌ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది. ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్‌ దృష్టికి వెళ్లి పది నెలలు అవుతోంది. ఇంకెంత సమయం కావాలి? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
  • ఈ కేసులో సుప్రీంకోర్టు 10 మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. వీరి తరపు వాదనలను కూడా వినింది. ఏప్రిల్ 3వ తేదీన వాదనలు పూర్తి చేసిన అత్యున్నత ధర్మాసనం… తీర్పును రిజర్వ్ చేసింది. జూలై 31న వెలువరిస్తామని పేర్కొంది.
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు 3 నెలలతో కూడిన కాలపరిమితి విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం