TS Governor vs Government : గవర్నర్ పై తెలంగాణ సర్కార్ పిటిషన్.. ఏం జరగబోతుంది?
Governor vs Telangana Government : గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లుఎక్కింది. పెండింగ్ బిల్లుల(అసెంబ్లీ ఆమోదించిన) విషయంలో గవర్నర్ తీరును తప్పుబడుతూ... అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది . ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.
TS Govt Petition in Supreme Court Against Governor: గత కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. గవర్నర్ తమిళిసై అనుసరిస్తున్న వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది శాసనసభ ఆమోదించిందిన పలు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఈ వ్యాజంపై త్వరలోనే సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పబోతుంది..? గత తీర్పులను ప్రస్తావిస్తూ... కొత్తగా కీలక తీర్పు ఏమైనా ఇస్తుందా..? అసలు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
హోలీ సెలవుల తరువాతే తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగా మరో వారం రోజుల తరువాతే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని అనుసరించి వేసింది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు తలుపు తట్టక తప్పలేదని తెలంగాణ సర్కార్ తన పిటిషన్‌లో వెల్లడించింది. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. పిటిషన్ లో ప్రధానంగా రాజ్యాంగంలోని 163, 200 అధికరణలను ప్రస్తావించింది. ఇవే కాకుండా... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేసులో కోడ్ చేసింది.
నిజానికి శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంటే ఆయా బిల్లులు చట్టంగా మారే పరిస్థితి ఉండదు. ఇక తన వద్దకు వచ్చే బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపటం కానీ... లేక మార్పులు కోరుతూ తిరిగి శాసనసభకు పంపవచ్చు. అయితే సభకు తిరిగి వెళ్లే బిల్లు మళ్లీ గవర్నర్ వద్దకు వస్తే మాత్రం కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ గవర్నర్... తన వద్ద ఉన్న బిల్లులను ఆమోదించటం కానీ.. లేక తిరిగి పంపటం కానీ చేయటం లేదు. ఫలితంగా ఇదీకాస్త ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఆయా బిల్లులను రాష్ట్రపతి సమీక్ష కోసం కూడా పంపవచ్చు. కానీ అలా కూడా జరగటం లేదు. ఇలా నెలల తరబడి రాజ్ భవన్ కార్యాలయంలోనే బిల్లులు పెండింగ్ ఉండటంపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే బిల్లులను గవర్నర్ ఆమోదించే విషయంలో కాలపరిమితి గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. సాధ్యమైనంత త్వరగా బిల్లులకు ఆమోదం తెలపాలని మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదంపై క్లారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో... కోర్టు ఏం చెప్పబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగ వ్యవస్థలను ఆదేశించే విషయంలో సుప్రీంకోర్టు... చాలా లోతుగా ఆలోచిస్తోంది. రాష్ట్రపతి, గవర్నర్ల వ్యవహారాల జోక్యంపై పరిధిని మించి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండదు. అయితే పెండింగ్ బిల్లుల విషయంలో పలు అంశాలను ప్రస్తావించే అవకాశం మాత్రం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిల్లులను ఆపటానికి గల కారణాలు..? బిల్లుల్లో ఇబ్బందులు ఉంటే తిప్పి పంపటం..? రాష్ట్రపతి సమీక్ష.. వంటి అంశాలను కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఫలానా సమయం అంటూ మాత్రం కోర్టు నిర్దేశించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ పంచాయితీకి పుల్ స్టాప్ పడిందని అందరూ భావించిన సమయంలో… బిల్లుల అంశం మాత్రం తేలకపోటం, సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో మరోసారి రాజ్యాంగ వ్యవస్థల మధ్య దూరం పెరిగినట్లు అయింది. ఇప్పటికే ఈ అంశంపై గవర్నర్ కూడా స్పందించారు. సీఎస్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది..? అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు.
సంబంధిత కథనం