SLBC Project : 20 ఏళ్లుగా పెండింగ్ లోనే...! అసలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఏంటి..? ముఖ్యమైన 10 విషయాలు-what is the main purpose of slbc project key points here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Slbc Project : 20 ఏళ్లుగా పెండింగ్ లోనే...! అసలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఏంటి..? ముఖ్యమైన 10 విషయాలు

SLBC Project : 20 ఏళ్లుగా పెండింగ్ లోనే...! అసలు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ ఏంటి..? ముఖ్యమైన 10 విషయాలు

Srisailam Left Bank Canal Project : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ పనులు రెండు దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానమైన సొరంగం పనులను పూర్తి చేసేందుకు టన్నెల్ బోర్ మిషన్ తో పనులు చేస్తున్నారు. పనులు నత్తనడకన సాగుతుండగా… ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగిపోయింది.

SLBC ప్రాజెక్ట్ (Image Source @KomatireddyKVR 'X')

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపి… రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది. అయితే వీరి జాడను పట్టుకోవటం అతిపెద్ద సవాల్ గా మారింది. సొరంగం లోపల నీళ్లు, బురుద పేరుకుపోవటంతో…. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవటం ఇబ్బందికరంగా మారింది.

ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటనతో ఈ ప్రాజెక్ట్ పై తెగ చర్చ జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావటం లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ స్వరూపం ఏంటి..? సొరంగం ఎందుకు చేస్తున్నారు..? వంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూడండి….

  1. ఎస్ఎల్‌బీసీ(Srisailam Left Bank Canal Project)…. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్ట్ పూర్తి కోసం 20 ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.
  2. శ్రీశైలం బ్యాక్ వాటర్ ను వినియోగించుకుని నల్గొండ జిల్లాలో ప్రధానంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్.ఎల్.బి.సి) ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు.
  3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదలైన సాగునీటి ప్రాజెక్టుల జలయజ్ఞంలో భాగంగా SLBC కార్యరూపం దాల్చింది.
  4. మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.1925కోట్ల అంచనాతో 2007లో పనులు మొదలయ్యాయి. నిర్ణీత గడువు మేరకు ప్రాజెక్టు పనులు మొదలయ్యాక నాలుగేళ్లకు పూర్తికావాల్సి ఉండాలి. కానీ ఇప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు.
  5. ఈ ప్రాజెక్టులో 43.93 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్) మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది.
  6. ఈ ప్రాజెక్టులో కాల్వలు తవ్వాల్సిన ప్రాంతమంతా నల్లమల రిజర్వు అటవీ ప్రాంతంలో ఉండడంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో సొరంగ మార్గాల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించారు.
  7. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగం ద్వారా నీటిని తీసుకుని నల్గొండ జిల్లా పరిధిలోని చందంపేట మండలం తెల్దేవర్ పల్లి వద్ద నీటిని బయటకు పోయడానికి మొత్తంగా సుమారు 44 కిలోమీటర్ల (43.930కి.మీ) మేర సొరంగం తవ్వాల్సి వచ్చింది.
  8. శ్రీశైలం వైపు ఇన్ లెట్ 13.9కి.మీ నిడివిలో…. నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఔట్ లెట్ కు 20.4 కిమీటర్ల నిడివిలో సొరంగాలు తవ్వాలి. దీనికి కోసం కోట్లాది రూపాయలను ప్రభుత్వం వెచ్చింది. టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం)ను తెప్పించింది. ఇది రెండు సార్లు శ్రీశైలానికి భారీ వదలు వచ్చిన సమయంలో నీటిలో మునిగిపోయి మర్మమతులు గురైంది.
  9. ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టును రూ.1925 కోట్ల అంచనాతో మొదలు పెడితే.. అదిప్పుడు రూ. 4 వేల కోట్లను దాటిపోయింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కోసం మరో 2 వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరగటమే కాకుండా… బడ్జెట్ పెరుగుతూ వచ్చింది.
  10. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్…. ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2026 జూన్ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి… పలుమార్లు సమీక్షలు నిర్వహించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం