KCR National Party : జాతీయ పార్టీగా గుర్తింపు ఎలా వస్తుంది? ఎన్ని ఉన్నాయి?
TRS To BRS : టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ పార్టీగా కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నవి ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఎన్నికల సంఘం వాటన్నింటిని గుర్తించదు. నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. అర్హతలు ఏమిటి? ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తుంటారు?

ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాలపై కేసీఆర్(KCR) ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. ఫ్రంట్ గా ఏర్పడి బీజేపీ(BJP)ని గద్దె దించాలని ప్రణాళికలు వేశారు. ఇతర రాష్ట్రాల్లోని అనేక మంది కీలక నేతలను కలిశారు. చివరకు ఆయనే తన టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు. జాతీయ రాజకీయాల్లోకి ఈ పార్టీతోనే వెళ్లనున్నారు. కానీ ఎన్నికల సంఘం(Elections Commission) జాతీయ పార్టీ అని చెప్పగానే గుర్తిస్తుందా? ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి?
పార్టీ స్థాపించి ఎవరైనా.. జాతీయ పార్టీ(National Party) అని చెప్పుకొవచ్చు. కానీ ఎన్నికల సంఘం గుర్తించాలంటే మాత్రం దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. జాతీయ పార్టీగా రిజిస్టర్ చేసుకుని.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయోచ్చు. పోటీ చేసినంత మాత్రన.. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించదు. కొన్ని అర్హతలు ఉండాలి.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్ల(Votes)ను సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదా లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల్లో గానీ పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు వచ్చి ఉండాలన్నమాట. నాలుగు ఎంపీ సీట్ల(MP Seats)ను సైతం గెలవాలి. మరో అవకాశం కూడా ఉంది. అది ఏంటంటే.. దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలిచి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీ(Regional Party)గా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా.. జాతీయ పార్టీగా గుర్తిస్తారు. దానికి ఉదాహరణ.. తృణమూల్ కాంగ్రెస్(trinamool congress) పార్టీనే. దీని ప్రకారమే జాతీయ పార్టీగా గుర్తింపు వచ్చింది.
జాతీయ గుర్తింపు వస్తే.. పార్టీలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కడ పోటీ చేసినా ఒకే గుర్తు ఉంటుంది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దూరదర్శన్, ఆలిండియా రేడియోల(All India Raido)లో ప్రచారానికి ఉచితంగా సమయం కూడా ఉంటుంది. ఓటర్ల జాబితాలను ఉచితంగా అందుకోవచ్చు. దిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ రేటుకే భూమి కూడా వస్తుంది.
దేశంలోనే కాదు.. రాష్ట్రంలోనూ.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉండాలన్న కష్టమే. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరుశాతం ఓట్లు వచ్చి ఉండాలి. అంతేకాదు.. రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి. ఆరుశాతం ఓట్లు తెచ్చుకుని.. ఎంపీ సీటు గెలవాలి.
దేశంలోని జాతీయ పార్టీలు ఇవే..
1.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2.భారతీయ జనతా పార్టీ 3.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-సీపీఐ 4.కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)-సీపీఎం 5.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 6.బహుజన్ సమాజ్ పార్టీ 7.నేషనలిస్ట్ కాంగ్రెస్ 8. నేషనల్ పీపుల్స్ పార్టీ