TG TET 2024 II Updates : తెలంగాణ టెట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? సిలబస్ వివరాలు, పరీక్షా విధానం ఇదే..!
TG TET 2024 II Exam Pattern Syllabus: తెలంగాణ టెట్ - II కు ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి. నవంబర్ 20వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఈ ఏడాదిలో ఇది రెండో టెట్ నోటిఫికేషన్. అయితే పరీక్షా విధానం, సిలబస్ తో పాటు మరిన్ని ముఖ్య వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి…
తెలంగాణలో ఈ ఏడాది రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 7వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. నవంబర్ 20వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పూర్తిస్థాయి నోటిఫికేషన్ వివరాలను కూడా చూడొచ్చు.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి. డీఎస్సీ ఉద్యోగాల ఎంపికలో టెట్ స్కోర్ ఎంతో కీలకం. టెట్ స్కోర్ కు 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. అయితే టెట్ 2024 పరీక్ష విధానమేంటి..? సిలబస్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి..? అనేది ఇక్కడ చూడండి…
టెట్‌లో రెండు పేపర్లు:
‘టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. పేపర్-2లో మళ్లీ గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి.
అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
అర్హత సాధించాలంటే..?
టెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగైతేనే టెట్ లో అర్హత సాధించినట్లు అవుతారు. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులవుతారు. ఇక గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు కూడా టెట్ అర్హత తప్పనిసరి.
తెలంగాణ టెట్ సిలబస్ ఎలా ఉంటుంది..?
శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు): పేపర్ -1 లో శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహనపై ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు (30 మార్కులు) : పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు అనే అంశాలు ఉంటాయి.
ఇంగ్లీష్ (30 మార్కులు) : ఆంగ్లభాష విషయాలు, వ్యాకరణం (24 మార్కులు), ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు), అన్ని కలిపి 30 మార్కులు ఉంటాయి.
గణిత శాస్త్రం (30 మార్కులు) : సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్, ఆల్‌జీబ్రా (24 మార్కులు), గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)
పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) : నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, జంతువులు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజవనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)
టెట్ పేపర్ 2 సిలబస్( సైన్స్, సోషల్…..
శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం(30 మార్కులు): శిశు వికాసం, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తనా సమస్యలు, నేర్చుకునే సామర్థ్యం, మానసిక ఆరోగ్యం బోధన శాస్త్ర అవగాహన తదితర అంశాలు ఉంటాయి.
తెలుగు భాష( 30 మార్కులు): పఠనావగాహన(పద్యం, గద్యం), 2015లో రూపొందించిన పాఠ్య పుస్తకాల ఆధారంగా తెలంగాణ సాహిత్యం, సంస్కృతి(ప్రాచీనం, ఆధునికం), పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
ఇంగ్లీష్ సబ్జెక్ట్ (30 మార్కులు) : ఆంగ్లంలోని పార్ట్స్ ఆఫ్ స్వీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వెర్బ్‌లు తదితర మొత్తం 20 రకాల వ్యాకరణాంశాలు. వాటికి 24 మార్కులు. మరో 6 మార్కులు ఆంగ్ల బోధనా పద్ధతులకు ఉంటాయి.
గణితం, సైన్స్( 60 మార్కులు): గణితానికి 30, సైన్స్‌కు 30 మార్కులుంటాయి. గణితంలో సంఖ్యామానం, అంకగణితం, సెట్స్, అల్‌జీబ్రా, రేఖాగణితం(జామెట్రీ), మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్, త్రికోణమితి, గణిత బోధన పద్ధతులు.
సైన్స్‌లో: ప్రకృతి వనరులు, మన విశ్వం, మెకానిక్స్, మేగ్నటిజం అండ్ ఎలక్ట్రిసిటీ, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, పదార్థం, అణు నిర్మాణం, జీవశాస్త్రం తదితర అంశాలు.
పేపర్-2లో సోషల్ స్టడీస్(60 మార్కులు): భూ వైవిధ్యం, ఉత్పత్తి- వలసలు, జీవనోపాధి, రాజకీయ వ్యవస్థలు, సామాజిక అసమానతలు, మతం- సమాజం, సంస్కృతి-కమ్యూనికేషన్ తదితర అంశాలకు 48 మార్కులు ఉంటాయి. మరో 12 మార్కులు బోధన పద్ధతులకు ఉంటాయి.
టెట్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ సబ్జెక్టుకు ప్రిపేర్ అవుతున్నారో సదరు అభ్యర్థులు…. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ నుంచి సిలబస్ కాపీలను పొందవచ్చని అధికారులు సూచించారు.పైన పేర్కొన్న అంశాలతో పాటు ఇంకా ఏమైనా మార్పులు ఉంటే గమనించవచ్చు.
తెలంగాణ టెట్ 2024 II నోటిఫికేషన్ - ముఖ్య తేదీలు:
- తెలంగాణ టెట్ - 2 దరఖాస్తులు ప్రారంభం - నవంబర్ 07, 2024
- దరఖాస్తులకు తుది గడువు - నవంబర్ 20, 2024.
- టెట్ దరఖాస్తుల వెబ్ సైట్ - https://tgtet2024.aptonline.in/tgtet/
- హాల్ టికెట్ల జారీ - 26 డిసెంబర్ 2024
- టెట్ పరీక్షలు - జనవరి 1, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 20, 2025తో ముగుస్తాయి.
- పరీక్ష సమయం - మొదటి సెషన్: 9.00 AM to 11.30 AM, రెండో సెషన్ : 2.00 PM to 4.30 PM
- టెట్ తుది ఫలితాలు - 05 ఫిబ్రవరి 2025.
సంబంధిత కథనం