KCR Strategies: మోదీపై కేసీఆర్ పోరాటం.. వ్యూహం అదేనా.. ?-what is kcr strategy behind championing the idea of non congress non bjp opposition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Is Kcr Strategy Behind Championing The Idea Of Non Congress Non Bjp Opposition

KCR Strategies: మోదీపై కేసీఆర్ పోరాటం.. వ్యూహం అదేనా.. ?

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 02:27 PM IST

KCR Strategies: రాజకీయ వ్యూహాలు రచించడం.. వాటిని పక్కాగా అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఈ ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... కేసీఆర్ మరోసారి స్ట్రాటజీలు మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఖమ్మం సభ నుంచి ఆ వ్యూహాల అమలు ప్రారంభించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ కేసీఆర్ ప్లాన్ ఏంటి ? కేంద్రంలోని మోదీ సర్కార్ పై పోరాడుతున్న నేతగా ... తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు.. ? గులాబీ బాస్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ రహిత విపక్షాల కూటమి సాధ్యమా.. ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR Strategies: ఎన్నికల రాజకీయాలలో నేతలు అనేక మాటలు చెబుతారు. వ్యూహాత్మక సందేశాలు ఇవ్వడంలో దిట్టగా పేరుగాంచిన నేతలు.. ప్రజలను ఉద్దేశించి చెప్పే మాటల్లో.. అసలు మర్మం వేరే ఉంటుంది. పైకి లక్ష్యం ఒకటి చెప్పినా.. అంతర్గత స్ట్రాటజీ మాత్రం మరోటి ఉంటుంది. నేషనల్ పాలిటిక్స్ పేరిట కేసీఆర్ వేస్తున్న అడుగుల వెనుక కూడా అసలు మర్మం వేరే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేస్తూ... రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో... కాంగ్రెస్ రహిత విపక్ష కూటమి అంటూ గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాల నుంచి స్పందన రావడం లేదనే చర్చ సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్... ఇటీవల ఖమ్మంలో భారీస్థాయిలో ఆవిర్భావ సభ నిర్వహించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రహిత కూటమి అధికారంలోకి రావడమే సంకల్పమన్న కేసీఆర్.. ఢిల్లీ, పంజాబ్ ఆప్ సీఎంలు.. కేరళ సీఎం పినరయి విజయన్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ను సభకు ఆహ్వానించారు. కేసీఆర్ సహా నేతలంతా ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తామంతా ఐక్యంగా పోరాడతామని ఈ నేతలంతా సభా వేదికగా నినదించారు. తద్వారా 2024 ఎన్నికలు... మోదీ వర్సెస్ విపక్షాల కూటమి అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో.. ప్రగతిశీల శక్తులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతామని కేసీఆర్ ప్రకటించారు

వేర్పాటువాద నినాదంతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్... ఇప్పుడు సమాఖ్యస్పూర్తి రాగం అందుకున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రయాణం.. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి చేరిన తర్వాత నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడం.. అందులోను పలువురు విపక్ష పార్టీల నేతలు హాజరుకావడంతో.. ఖమ్మం సభ మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే విపక్షాల్లో ప్రధాన నేతలుగా భావిస్తోన్న తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాకపోవడం అనేక ప్రశ్నలకు తావిచ్చింది. వచ్చే ఎన్నికల్లో విపక్షాలు కూటమి కడితే... ఈ ఇద్దరు నేతలు ప్రధాన మంత్రి రేసులో ముందు వరుసలో ఉంటారన్న ప్రచారం జరగుతున్న నేపథ్యంలో... వీరిరువురూ కేసీఆర్ సభకు డుమ్మా కొట్టడం పొలిటికల్ నిపుణులని ఆశ్చర్య పరిచింది. ఈ పరిణామం బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలలో కొరవడిన ఐక్యతను సూచిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విపక్షాల మధ్య ఇంకా కొనసాగుతున్న దూరాన్ని స్పష్టం చేస్తోందనే చర్చ సాగుతోంది. అదే సమయంలో.. ఇప్పటి వరకూ కాంగ్రెస్ తో కలిసి సాగుతోన్న పలు విపక్ష పార్టీలను.. హస్తం నుంచి దూరం చేసేందుకు... తద్వారా బీజేపీ, కాంగ్రెస్ రహిత కూటమి ఏర్పాటుకు ... బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ద్వారా కేసీఆర్ తొలి అడుగు వేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2014, 2019 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది. కాషాయా దళాన్ని ఢీకొట్టాలని చూస్తోన్న విపక్షాలు మాత్రం ఇప్పటికీ తలోదిక్కు అన్నట్లుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో... అపోజిషన్ లో అత్యంత కీలకమైన కాంగ్రెస్ పార్టీ లేకుండా విపక్షాల కూటమికి ప్రయత్నిస్తున్న కేసీఆర్.. అనుకున్నది సాధిస్తారా ? అని అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు నుంచి ఎంకే స్టాలిన్, కర్ణాటక నుంచి హెచ్ డీ కుమారస్వామి, బిహార్ నుంచి తేజశ్వీ యాదవ్ సహా ఇతర రాష్ట్రాల్లో మరికొందరు ముఖ్య నేతలకు... కాంగ్రెస్ తో సఖ్యత ఉంది. ఖమ్మం సభకు వీరిలో ఎవరూ రాకపోవడం... కేసీఆర్ కూటమి రాగంపై అనేక అనుమానాలు కలిగేలా చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది.

బీజేపీపై పోరాటం అంటూ.. అదే సమయంలో కాంగ్రెస్ కి దూరం అంటూ.. కేసీఆర్ వేస్తున్న అడుగుల్లో.. స్వీయ రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. తెలంగాణలో రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ పై నమ్మకంతో.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని కాదని, ప్రజలు బీఆర్ఎస్ కు అధికారం అప్పగించారు. అయితే.. పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ పట్ల ఇటీవల వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో.. రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. 2018లో అనామక స్థాయిలో ఉన్న ఆ పార్టీ... నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో... ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీ నుంచి ఎదురవుతోన్న ఒత్తిడిని అధిగమించడంలో భాగంగా.. కేసీఆర్ సరికొత్త వ్యూహాలకు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జాతీయ రాజకీయాలతో.. బీజేపీపై దండయాత్ర పేరుతో ప్రజల దృష్టిని మరల్చి.. రాష్ట్రంలో పొలిటికల్ మైలేజ్ సాధించాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి... కేసీఆర్ జాతీయ దృష్టిని ఆకర్షించింది.. తెలంగాణ నినాదంతోనే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ఆ తర్వాత తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడటం వంటివి... జాతీయ వేదికపై కేసీఆర్ ని హీరో చేశాయి. అయితే.. నేషనల్ పాలిటిక్స్ పేరిట తెలంగాణ వాదాన్ని వీడటం.. గులాబీ బాస్ కి ఏ మేర ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయంపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు... తెలంగాణలో ప్రాభవం కోల్పోయేలా చేస్తాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో.. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలోని విపక్ష పార్టీలు కేసీఆర్ అడుగులకి ఏ స్థాయిలో అండగా నిలుస్తాయన్నది ప్రశ్నార్థకమే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

వాస్తవానికి 2019 నుంచి బీజేపీ, కాంగ్రెస్ రహిత కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, ఎంకే స్టాలిన్ లను కలిశారు. అప్పుడు కేవలం తెలంగాణలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నుంచి కూటమి ప్రయత్నాలు జరిగాయి. అయితే.. అప్పట్లో విపక్ష నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఇప్పుడు జాతీయ పార్టీగా చేస్తున్న యత్నాలకు కూడా అదే పరిస్థితి ఎదురవనుందనే అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కారణం... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను దూరం పెట్టాలని చూడటమేనని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఎక్కువ విపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి సాగుతున్నాయి. కొన్నింటికీ రాష్ట్ర స్థాయిలో వాటి ప్రాధామ్యాలు వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్ రహిత విపక్ష కూటమి అనే నినాదానికి.... బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు అంతగా స్పందించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

రానున్న రోజుల్లో విపక్షాల మధ్య ఐక్యత కుదిరి.. కూటమి కడితే... కేసీఆర్ కూడా అందులో సభ్యుడిగా ఉంటారని... అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా మాత్రం కాంగ్రెస్ ఉంటుందని పొలిటికల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్... కాంగ్రెస్ ను దూరం పెట్టాలన్న ప్రయత్నాలను ఇలాగే కొనసాగిస్తే మాత్రం.... అది విపక్షాల మధ్య చీలికకు దారితీస్తుందని చెబుతున్నారు. గతంలోనూ విపక్షాల్లో రెండు కూటములను చూసిన ప్రజలు.. మరోసారి అలాంటి ఎత్తులను స్వాగతించే పరిస్థితి ఉండదని.... తద్వారా బీజేపీ అంతిమ లబ్ధి పొందుతుందని తేల్చి చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే.... కేసీఆర్ ఖమ్మం సభని వ్యూహాత్మకంగా నిర్వహించారనే టాక్ వినిపిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఏర్పడిన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ... నరేంద్ర మోదీపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడిగా ప్రజల దృష్టిలో నిలిచేందుకు.. తద్వారా మరోసారి ప్రజల ఆశీస్సులు పొందాలన్నదే కేసీఆర్ వ్యూహం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బలంగా నాటుకుపోయిన నరేంద్ర మోదీని ఢీకొట్టగల ప్రతిపక్ష నేతగా పబ్లిక్ దృష్టిని ఆకర్షించేందుకే ఖమ్మం సభ ద్వారా ప్రయత్నం జరిగిందనే పేర్కొంటున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక సందేశం వెనుక అసలు మర్మం ఇదేనని చెబుతున్నారు.

IPL_Entry_Point