ఫోన్ ట్యాపింగ్ కేసు : ఇప్పటి వరకు ఏం జరిగింది….? ముఖ్యమైన 10 అంశాలు-what has happened so far in the telangana phone tapping case key points here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఫోన్ ట్యాపింగ్ కేసు : ఇప్పటి వరకు ఏం జరిగింది….? ముఖ్యమైన 10 అంశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు : ఇప్పటి వరకు ఏం జరిగింది….? ముఖ్యమైన 10 అంశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్… వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావుని కూడా ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులోని మూలాలను వెలికి తీసే పనిలో అధికారులు ఉన్నారు.

ఇప్పటి వరకు ఏం జరిగింది - ముఖ్యమైన అంశాలు..!

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖలు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. మొత్తం ఎపిసోడ్ పై సిట్ విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచి… ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
  • ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావ్ అనే అధికారితో అరెస్టుల పర్వం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు అదనపు ఎస్పీలను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మరికొంత మంది అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు.
  • ఫోన్ ట్యాపింగ్ కేసు కొన్ని పరికరాలను కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఇజ్రాయెల్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ పరికరాల దిగుమతికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. దీనిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
  • 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. బాధితుల్లో రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తులతో పాటు పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లు కూడా ఇందులో ఉన్నట్లు సిట్ వర్గాల మేరకు తెలుస్తోంది.
  • 600కుపైగా బాధితులతో కూడిన ఓ జాబితాను కూడా సిట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. త్వరలోనే మరికొంతమంది రాజకీయ నాయకుల నుంచి వాంగ్మూలాలను సేకరించే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు.
  • తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలోని సిట్‌కు వాంగ్మూలమిచ్చారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను దర్యాప్తు అధికారులకు వివరించారు.
  • ఈ కేసులో మొదట్నుంచి కీలకంగా ఉన్న ప్రణీత్‌రావును మరోసారి సిట్ విచారించనుంది. ప్రభాకర్‌రావు ముందుంచి విచారించాలని సిట్ భావిస్తోంది. రేపోమాపో ఈ విచారణ జరిపే అవకాశం ఉంది.
  • ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే అంటూ తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తప్పకుండా తన దగ్గర ఉన్న ఆధారాలతో అధికారులకు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని వదిలిపెట్టకూడదని ప్రభుత్వాన్ని కోరారు.
  • ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కాంగ్రెస్ నేత వైఎస్‌ షర్మిల ఫోన్లు కూడా ట్యాప్‌ అయ్యాయనే వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి. దీనిపై సిట్ వర్గాలతో పాటు షర్మిల నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
  • ప్రస్తుతం బాధితుల నుంచి సిట్ సేకరిస్తున్న వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చర్యలు తీసుకనే విషయంలో కేవలం అప్పటి పోలీసుల అధికారుల వరకే ఈ వ్యవహారం పరిమతవుతుందా..? లేక అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతల వరకు వస్తుందా అనేది ఉత్కఠను రేపుతోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.