TG Govt Schemes : రైతుబంధు.. వడ్లకు బోనస్.. తెలంగాణ రైతులు ఏది కోరుకుంటున్నారు? 8 ముఖ్యాంశాలు
TG Govt Schemes : తెలంగాణలో వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలు మొదట్లో భయపడినా.. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు రైతుబంధు, వడ్లకు బోనస్‌పై తెలంగాణ రైతుల్లో చర్చ జరుగుతోంది. తమకు ఏది మంచిదో అన్నదాతలు చర్చించుకుంటున్నారు.
అన్నదాతల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పట్టా భూములు ఉన్నవారికి పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రైతు భరోసా పేరిట పథకం అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇంకా విధివిధానాలు ఖరారు చేయలేదు.
ఈలోపు రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పండించిన వడ్లకు బోనస్ రూపంలో రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. దీంతో రైతులు రైతుబంధు, వడ్లకు బోనస్‌ను పోల్చి చర్చించుకుంటున్నారు. ఈ రెండు పథకాలకు సంబంధించి 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' క్షేత్రస్థాయిలో కొందరు అన్నదాతలతో మాట్లాడింది. ఈ సందర్భంగా రైతులు చెప్పిన ముఖ్యమైన 8 విషయాలు ఇలా ఉన్నాయి.
1.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాకు రూ.4వేలు చొప్పున పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం చేసేవారు. అప్పుడు కేవలం పట్టా భూములు ఉన్నవారికే లబ్ధి చేకూరేది.
2.తెలంగాణలో చాలావరకు అసైన్డ్ భూములు సాగులో ఉన్నాయి. వాటికి రైతుబంధు వచ్చేది కాదు. అటు పట్టా భూములు ఉన్నవారు ఎక్కువమంది కౌలుకు ఇచ్చేవారు. దీంతో ఇటు కౌలు డబ్బులు, అటు రైతు బంధు డబ్బులు వారికే వచ్చేవి.
3.ఉదాహరణకు ములుగు జిల్లా ఉంది. అక్కడ దాదాపు 90 శాతం వరకు పట్టా భూములు లేవు. కానీ సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. అక్కడ రైతుబంధు సాయం చాలా తక్కువమందికి వచ్చేది.
4.ప్రస్తుతం వడ్లకు బోనస్ చాలా బాగుంది. ఎకరాకు రూ.500 చెల్లిస్తున్నారు. ఇవి కష్టపడిన రైతుకు దక్కుతున్నాయి. డబ్బులు కూడా ధాన్యం నగదు జమ చేసిన వారం రోజుల్లో బోనస్ వేస్తున్నారు.
5.బోనస్ వేయడానికి కేవలం ధాన్యం అమ్మితే సరిపోతుంది. దీనికి పట్టా భూమే కావాల్సిన అవసరం లేదు. పహణీ ఉన్నా అధికారులు డబ్బులు వచ్చేలా చేస్తున్నారు.
6.ఎకరం పొలం ఉన్న రైతు.. తక్కువలో తక్కువ 15 క్వింటాళ్లు పండిస్తున్నారు. వీటికి ధాన్యం నగదు పోనూ.. బోనస్ రూపంలో రూ.7500 వస్తున్నాయి. అదే రైతుబంధు అమల్లో ఉంటే.. ఎకరాకు రూ.4 వేలు వచ్చేది. అది కూడా అందరికీ కాదు.
7.రైతుబంధు కంటే.. వడ్లకు బోనస్ బాగుంది. కష్టపడే రైతులకు ఉపయోగకరంగా ఉంది. మద్దతు ధర రూ.2300, బోనస్ రూ.500 కలిపితే.. ఒక్కో క్వింటాళ్‌కు రూ.2800 వస్తున్నాయి. ఇది చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేలా ఉంది. రైతుబంధు పదులు, వందల ఎకరాలు ఉన్నవారికే ఉపయోగకరంగా ఉండేది.
8.ప్రభుత్వం ఈ బోనస్ విధానాన్ని కొనసాగించాలి. రైతుబంధు అమలు చేసినా.. దానికి ఓ హద్దు ఉండాలి. వ్యవసాయం చేయనివారికి పెట్టుబండి సాయం ఎందుకు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించి పథకాలు అమలు చేయాలి.. అని రైతులు అభిప్రాయపడుతున్నారు.