తెలుగు న్యూస్ / తెలంగాణ /
TG Bhu Bharathi Act 2024 : భూ భారతి చట్టంలో ఏముంది..? అమల్లోకి వస్తే జరిగే మార్పులేంటి..?
Telangana Bhu Bharathi Act 2024 : భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చట్టం అమల్లోకి రాబోతుంది. అర్వోఆర్-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ… ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి చట్టం అమల్లోకి రానుంది.
భూ భారతి చట్టం - 2024
ధరణి స్థానంలో ‘తెలంగాణ భూ భారతి - 2024 చట్టం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ శాసనభ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చే దిశగా సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉంది.
భూభారతి పూర్తిగా అమలు లోకి రావడానికి ఇంకా రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ… భూ భారతి పూర్తిస్థాయిలో అమల్లోకి రావటానికి రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. భూ భారతితో ప్రతి రైతుకు భరోసా దక్కబోతుందన్నారు.
- ధరణిని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భూ భారతి చట్టాన్ని రూపొందించింది. త్వరలోనే అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే శాసన ప్రక్రియ ముగిసింది. త్వరలో గెజిట్ వచ్చే అవకాశం ఉంది.
- భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్లో 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూ భారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి ఆరుకు కుదించారు.
- ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలమ్ ను మళ్లీ తీసుకురానున్నారు. అనుభవదారుడికి ఈ చట్టం రక్షణగా నిలువనుంది.
- ఈ చట్టం ప్రకారం మ్యుటేషన్‌కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే… ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.
- భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్‌ప్లే చేస్తారు.
- ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. 2014 జూన్ 2 ముందుకు జరిగిన సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరించనున్నారు.
- భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేశారు.
- చాలా ఏళ్లుగా 38E, ఓఆర్‌సీ, లావణి పట్టా వంటి భూముల సమస్యలు ఉన్నాయి. వీటికి పాస్ పుసక్తాలు కూడా లేవు. అయితే కొత్త చట్టం ప్రకారం పాస్ బుక్ లు జారీ అవుతాయి. ఆర్డీవో ద్వారా ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం… గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు.
- భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలమ్‌లతో కొత్త పహాణీని ఏర్పాటు చేయనున్నారు.
- ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో ఆర్డీవోకు అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది. భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్- జాయిట్ సబ్ రిజిస్ట్రార్‌కు సమర్పించే భూ దస్త్రాలతో పాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్ ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్ లను కూడా భద్రపరుస్తారు.
సంబంధిత కథనం