Telangana Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై గురి..! కాంగ్రెస్ వ్యూహాలేంటి..?-what are the strategies of the telangana congress on the local body elections 2025 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై గురి..! కాంగ్రెస్ వ్యూహాలేంటి..?

Telangana Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై గురి..! కాంగ్రెస్ వ్యూహాలేంటి..?

Telangana Local Body Elections 2025 : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగనుంది. దీంతో ప్రధాన పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ… క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో బలపడాలని యోచిస్తోంది. నియోజకవర్గాలవారీగా సమీక్షిస్తూ.. ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్

తెలంగాణలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. గతేడాదిలోనే జరుగుతాయని అంతా భావించినప్పటికీ…. వాయుదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో, వార్డుల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే… వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది.

స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ… ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా…. పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ ప్లాన్ ఏంటి..?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. నిజానికి ఏడాదిలోపే స్థానిక ఎన్నికలకు కూడా వెళ్లాలని భావించింది. అయితే క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే… గతేడాది కాకుండా ఈ ఏడాదిలోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. తాజాగా గాంధీ భవన్ లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ అయింది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీపై చర్చించారు.

స్థానిక ఎన్నికలకు వెళ్లే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలను ప్రధాన అస్త్రాలుగా భావిస్తోంది. ఇందులో రుణమాఫీతో పాటు రైతు భరోసా వంటివి ఉన్నాయి. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేశామనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. జనాల్లోకి వెళ్లనుంది. అంతేకాకుండా రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నామని చెప్పనుంది.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పట్టాలెక్కించే విషయాన్ని హస్తం పార్టీ జనాల్లోకి తీసుకెళ్లనుంది. వీటికితోడు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను మరో అస్త్రంగా భావిస్తోంది. ఫ్రీ బస్సు పథకం, ఉచిత విద్యుత్ తో పాటు ఈ ఏడాది కాలంలో సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది.

తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లోసత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అంతేకాకుండా ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు చాలా మంది హస్తం గూటికి చేరారు. ఈ పరిణామాలన్నింటిని అనుకూలంగా మలుచుకోవం ద్వారా… గ్రామ, మండల, జిల్లా పరిషత్ పీఠాలపై హస్తం జెండా ఎగరవేయాలని బలంగా భావిస్తోంది.

సంబంధిత కథనం