TG Agriculture : తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరగడానికి కారణాలు ఏంటి?
TG Agriculture : గతంలో తెలంగాణలో వరిసాగు చాలా తక్కువగా ఉండేది. దానికి కారణం నీటి ఎద్దడి, కరెంట్ కోతలు, పెట్టుబడి భారం. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. వరిసాగు చేస్తే ఉరే అనే పరిస్థితి నుంచి.. వరిసాగు బహుబాగు అనే పరిస్థితి వచ్చింది. ఇంతలా మార్పు రావడానికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.

దాదాపు రెండు దశాబ్దాల కిందట.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బీడు భూములే దర్శనమిచ్చేవి. సాగునీరు అందక రైతులు భూములను అలాగే వదిలేసేవారు. చాలా గ్రామాల్లో పెట్టుబడి కోసం డబ్బులు లేక సాగు చేసేవారు కాదు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వేసినా ఫలితం ఉండేది కాదు. పైగా కరెంట్ కోతలు. ఇటు కాలువల ద్వారా వచ్చే నీరు అంతంత మాత్రంగానే ఉండేది.
కానీ గత పదేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. రైతులు పోటీపడి వరిసాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లలో దొడ్డు వడ్లు పండించిన రైతులు.. ఇప్పుడు సన్నాలు సాగు చేస్తున్నారు. కేవలం వానాకాలం మాత్రనే కాదు.. యాసంగి సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరిగింది. తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరగడానికి అనేక కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం.
నీటిపారుదల ప్రాజెక్టులు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక.. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. ఇంకా ఇలాంటి నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల సాగునీటి లభ్యత గణనీయంగా పెరిగింది. ఇది వరి సాగుకు బాగా ఉపయోగపడింది.
మిషన్ కాకతీయ..
మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగింది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయి. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 40 వేల చెరువులను అభివృద్ధి చేశారు. ఇది కూడా వరి సాగుకు దోహదపడింది.
రైతు బంధు..
రైతుబంధు పథకం ద్వారా.. రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందుతోంది. ఫలితంగా రైతులు వరి సాగుకు అవసరమైన పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. ఇతరుల దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.
రైతు బీమా..
ఈ పథకం రైతులకు భీమా సౌకర్యం కల్పిస్తోంది. దీనివల్ల రైతులు పంట నష్టపోయినా.. ఆర్థికంగా నష్టపోకుండా ఉండగలుగుతున్నారు. ఇది వారిని వరి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని అన్నదాతలకు అండగా ఉంటోంది.
ఉచిత విద్యుత్..
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీనివల్ల రైతుల నీటిపారుదల ఖర్చులు తగ్గాయి. ఇది వరి సాగుకు మరింత లాభదాయకంగా మారింది. గతంలో టైమింగ్స్ ఉండేవి. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరంతరాయంగా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు.
మార్కెటింగ్ సౌకర్యాలు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచింది. దీనివల్ల రైతులు పండించిన వరిని సులభంగా విక్రయించగలుగుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటోంది. తాజాగా బోనస్ కూడా ఇస్తోంది. అటు ప్రైవేట్ వ్యాపారులు కూడా వడ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు ఇబ్బంది లేదు.