TG Recruitment Exams : దండిగా దరఖాస్తులు - హాజరు మాత్రం అంతంతే..! ఎందుకిలా..?
తెలంగాణ గ్రూప్స్ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయానికి మాత్రం హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. ఇటీవలే జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత… ఉద్యోగాల కోసం భారీస్థాయిలో అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్స్ ప్రకటనల కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తూ… ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇందులో గ్రూప్ 2,3, 4 ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా నోటిఫికేషన్లు జారీ అయినప్పుడు లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావటమే ఇందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఇటీవలే కాలంలో చూస్తే ప్రభుత్వ ఉద్యోగ రాత పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే నోటిఫికేషన్లు వెలువడగానే మాత్రం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. అతి తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పటికీ… లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. కానీ ఎగ్జామ్స్ గైర్హాజరవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఏకంగా కొందరైతే హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవటం లేదు. ఇటీవలే జరిగిన పరీక్షల తీరును పరిశీలిస్తే… కొన్ని అంశాలను అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను కూడా వెల్లడించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే…
- రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఇటీవలే పరీక్షలు జరిగాయి.రెండు రోజుల్లో నిర్వహించిన నాలుగు పేపర్లకు కేవలం 45 శాతం హాజరు ఉండడం గమనార్హం.నిజానికి ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
- ఇక గ్రూప్ 3 పరీక్షలను చూస్తే…మూడు పేపర్లకు కలిపి మొత్తంగా 50 శాతం మందే హాజరయ్యారు. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- గత ఏడాది జూలైలో గ్రూప్ 4 పరీక్షలు జరిగాయి. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. కానీ ఏడున్నర లక్షల మంది మాత్రమే హాజరయ్యారు.
- ఇక గ్రూప్ 1 పరీక్షల ప్రిలిమ్స్ చూస్తే కూడా 70 శాతానికి పైగా మాత్రమే హాజరయ్యారు.
ఎందుకిలా…?
భారీ సంఖ్యలో దరఖాస్తులు చేస్తున్న అభ్యర్థులు… పరీక్షల సమయం వచ్చే నాటికి మాత్రం సీన్ లో ఉండటం లేదు. ఇందుకు గల కారణాలను పలువురు విశ్లేషిస్తున్నారు. నిర్ణీత సమయంలోపు నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి కాకపోవటం నిరుద్యోగులకు సవాల్ గా మారింది. ఏళ్లకు ఏళ్లుగా ప్రిపరేషన్ కావటం కూడా ఇబ్బందికరంగా మారింది. తీరా ఎగ్జామ్స్ జరిగిన తర్వాత పేపర్ లీక్ వంటి ఘటనలు వెలుగు చూడటంతో రాసిన పరీక్షలను కూడా రద్దు చేయటం జరిగింది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత కొత్త షెడ్యూల్ ఇచ్చి… పరీక్షలు నిర్వహించినప్పటికీ నిరుద్యోగులు పెద్దగా హాజరవుతున్న సందర్భాలు కనిపించటం లేదని పోటీ పరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల నేపథ్యంలో… ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా… ఉద్యోగాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటం, దరఖాస్తులు లక్షల్లో రావటం కూడా మరో కారణమని చెబుతున్నారు.