Union Budget 2025 : తెలంగాణకు నిధులేవి..? కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే…-what are the reactions of political parties on allocations to telangana in union budget 20252026 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Union Budget 2025 : తెలంగాణకు నిధులేవి..? కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే…

Union Budget 2025 : తెలంగాణకు నిధులేవి..? కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే…

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 02, 2025 07:19 AM IST

Union Budget 2025-2026 : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో తెలంగాణకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని… అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతున్నాయి. బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కేంద్ర బడ్జెట్ 2025
కేంద్ర బడ్జెట్ 2025

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలోనే…. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో ఆర్థిక మంత్రి భట్టితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

yearly horoscope entry point

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలోని చేపట్టిన కీలక ప్రాజెక్టుల విషయాలను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని… కానీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడమేంటని ప్రస్తావించినట్లు తెలిసింది.

కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లోక్ సభ సమావేశాల్లో బలంగా పోరాడే దిశగా కార్యాచరణను సిద్ధం చేసే పనిలో అధికార కాంగ్రెస్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అక్షరాల గుండు సున్నా - బీఆర్ఎస్

తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తెచ్చుకోలేని అధికార పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందన్నారు.

“రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే, ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్-చోటే భాయ్ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది. తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలకు బలం ఉన్న బిహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి… జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది” అని కేటీఆర్ విమర్శించారు.

తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుంది - కిషన్ రెడ్డి

తెలంగాణకు కేటాయింపులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం రాష్ట్ర బడ్జెట్ కాదన్నారు. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణకు భాగస్వామ్యం ఉంటుంది కదా అని వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన పలు పథకాల ద్వారా తెలంగాణకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పుకొచ్చారు.

రూ.10 వేల కోట్లతో ఏర్పాటుచేసిన స్టార్టప్‌ ఫండ్‌ వల్ల తెలంగాణ స్టార్టప్‌లు వృద్ధి చెందుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లమేర వడ్డీలేని రుణాలు అందుతాయని… అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌నుంచి హైదరాబాద్‌ వంటి నగరాలకు నిధులు అందుతాయని వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం