Kamareddy BC Declaration : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి?
Kamareddy BC Declaration : తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు కుల గణన చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తాజా నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఏముందో ఓసారి చూద్దాం.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో.. కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో.. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను పెంచుతామని.. అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

42 శాతం రిజర్వేషన్..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌తో పాటు.. బీసీ సబ్ ప్లాన్‌ను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీసీల అభివృద్దికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్ధానం చేసింది. ప్రతి జిల్లాకు బీసీ భవన్, అర్హులైన బీసీలకు రుణాలివ్వడం, ప్రతీ మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
సిద్ధరామయ్య సమక్షంలో..
అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు పెద్దపీట వేస్తూ.. ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కూడా వచ్చారు. ఆయన సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటన చేశారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ నేతలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయలాని డిమాండ్ చేస్తుంటారు.
ఇప్పటివరకు లెక్కలు లేవు..
ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు' అని సీఎం వ్యాఖ్యానించారు.
ఇచ్చిన మాట ప్రకారం..
'అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టాం. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించాం' అని రేవంత్ వివరించారు.
రూ.160 కోట్లు ఖర్చు చేసి..
'76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించాం. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.