'భూ భారతి' ప్రారంభం - ఈ కొత్త పోర్టల్ లో ఉన్న సేవల వివరాలివే-what are the options available on the telangana bhu bharati portal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'భూ భారతి' ప్రారంభం - ఈ కొత్త పోర్టల్ లో ఉన్న సేవల వివరాలివే

'భూ భారతి' ప్రారంభం - ఈ కొత్త పోర్టల్ లో ఉన్న సేవల వివరాలివే

తెలంగాణలో వ్యవసాయ భూముల నిర్వహణకు కొత్తగా భూ భారతి పోర్టల్ వచ్చేసింది. ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. కొత్తగా వచ్చిన ఈ పోర్టల్ లో ఉన్న సేవల వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

భూ భారతి

భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలను చూసే ధరణి స్థానంలో ‘భూ భారతి’ వచ్చేసింది. ఏప్రిల్ 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పోర్టల్ ను ప్రారంభించింది. ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభమయ్యాయి.

భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, నారాయణ పేట జిల్లా మద్దూరు మండలాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు మండలాల్లో భూ భారతి పోర్టల్ ద్వారానే భూముల క్రయవిక్రయాలు జరగనున్నాయి. అయితే ధరణి ప్లేస్ లో వచ్చిన భూ భారతి పోర్టల్ లో ఎలాంటి సేవలు, ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి…..

కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ లో సేవలను రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో భాగంగా పలు రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు.

ట్రాన్సక్షననల్ సర్వీసెస్:

  • రిజిస్ట్రేషన్ - సులభంగా భూ క్రయవిక్రయాలు జరిపేలా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందులో సేల్, గిఫ్ట్, లీజ్, జీపీఏ, మార్టిగేజ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
  • మ్యూటేషన్ - భూ హక్కుల బదిలీ ప్రక్రియ కోసం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నిర్ణీత గడువు లోపు మ్యుటేషన్‌ ప్రక్రియ చేస్తారు.
  • ఆర్వోఆర్ కరెక్షన్ - రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు.
  • నాలా - వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవచ్చు.
  • అప్పీల్ అండ్ రీవిజన్ - దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు.

ఇన్ఫర్మేషన్ సర్వీసెస్:

  • మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ - భూమి మార్కెట్ వాల్యూ వివరాలు తెలుసుకోవచ్చు.
  • ల్యాండ్ డీటేయిల్స్ సెర్చ్ - భూముల వివరాలను తెలుసుకోవచ్చు.
  • నిషేధిత ఆస్తుల వివరాలు - నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ఈ-చలాన్, అప్లికేషన్ స్టేటస్ - దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుసుకోవచ్చు. చలాన్ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు - రిజిస్ట్రేషన్ పూర్తైయిన వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

పైన పేర్కొన్న సేవలు పొందటానికి ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది. పౌరులు కూడా తమ వివరాలతో లాగిన్ అయితే… ఈ సేవలను సులభంగా పొందవచ్చు. కావాల్సిన వివరాలను తెలుసుకోవచ్చు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం