TG New Ration Card Application : కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ - దరఖాస్తుకు కావాల్సిన వివరాలు, పత్రాలేంటి..?-what are the documents required to apply for new ration card in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Ration Card Application : కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ - దరఖాస్తుకు కావాల్సిన వివరాలు, పత్రాలేంటి..?

TG New Ration Card Application : కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ - దరఖాస్తుకు కావాల్సిన వివరాలు, పత్రాలేంటి..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 22, 2025 10:45 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నూతన రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే విడుదల చేసిన జాబితాలో పేర్లు లేనివారితో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా గ్రామసభల్లో అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే ఇందుకు కావాల్సిన పత్రాలు, దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి…

కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ
కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ

తెలంగాణలో మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను తీసుకున్నప్పటికీ… వాటిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవలే నిర్వహించిన కుటుంబ సర్వే ఆధారంగా… రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సర్కార్ ప్రకటించింది. ఈ సర్వే ఆధారంగా.. కొన్ని పేర్లతో కూడిన జాబితాలు వచ్చాయి.

yearly horoscope entry point

కుల గణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలే కాకుండా…గతంలో మీసేవా ద్వారా అప్లికేషన్లు చేసుకున్న వారిలో కూడా కొంతమంది పేర్లను గుర్తించారు.ఆ జాబితాలను కూడా గ్రామాలవారీగా ప్రకటించారు. అయితే చాలా మంది తమ పేర్లు లేవని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరించే పనిలో పడింది. ఈ ప్రక్రియ జనవరి 21వ తేదీతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..?

జనవరి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన - గ్రామసభలను నిర్వహించనున్నారు. పట్టణాల్లో వార్డు సభలు చేపట్టారు. వీటిల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసంతో పాటు మార్పులు చేర్పులు కోరే వారు కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు.

కావాల్సిన పత్రాలేంటి..?

కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు… తెల్ల కాగితంపై అప్లికేషన్ రాసి ఇవ్వొచ్చు. కుటుంబ యజమాని ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలను పేర్కొన్నారు. ఆధార్ కార్డు నెంబర్లు తప్పనిసరిగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ తో పాటు ఆధార్ కార్డులను జత చేసి సమర్పించవచ్చు. గ్రామాల్లో అయితే గ్రామసభల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డు సభల్లో ఇవ్వొచ్చు.

ఇక మార్పులు చేర్పుల విషయానికి వస్తే కూడా దరఖాస్తు ఇవ్వొచ్చు. తెల్ల కాగితంపై కుటుంబ యజమాని పేరు రాయాలి. గతంలో కూడా రేషన్ కార్డు నెంబర్ ను రాసి.. చేర్చాల్సిన కుటుంబ సభ్యుల పేర్లను వివరంగా రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా… కొత్తగా చేర్చాలనుకువారి ఆధార్ నెంబర్లను పేర్కొనాలి. ఈ దరఖాస్తు ఫామ్ ను అధికారులకు సమర్పించాలి.

ఈ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత.. అధికారులు పరిశీలిస్తారు. ఈ వివరాలను ఆన్ లైన్ చేసే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత… అర్హులను గుర్తిస్తారు. ఆయా పేర్లతో కూడిన జాబితాలను సిద్ధం చేసి ప్రకటించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో అర్హత ఉన్న వారు ఆందోళన చెందవద్దని స్పష్టం చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని.. పాత రేషన్ కార్డులను కూడా రద్దు చేయబోమని తెలిపింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం