ఇరుకు మెట్లు, దట్టమైన పొగ.. తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్.. గుల్జార్​ హౌస్‌ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే!-what are the causes of the fire at gulzar house in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇరుకు మెట్లు, దట్టమైన పొగ.. తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్.. గుల్జార్​ హౌస్‌ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే!

ఇరుకు మెట్లు, దట్టమైన పొగ.. తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్.. గుల్జార్​ హౌస్‌ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే!

ఇరుకు మెట్లు. దట్టమైన పొగ. లోనికెళ్లే మార్గంలేక తలుపులు పగులగొట్టి రెస్క్యూ ఆపరేషన్.. చార్మినార్​ సమీపంలో గుల్జార్​ హౌస్‌ బిల్డింగ్​ ప్రమాదంలో చాలా లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఈ అగ్నిప్రమాద వివరాలను వెల్లడించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఘటనా స్థలంలో వ్యాపించిన పొగ

గుల్జార్​ హౌస్‌‌లో అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో తరచూ విద్యుత్ సమస్యలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించారు. మంటలు అంటుకున్నప్పుడు లోనికి వెళ్లేందుకు కూడా సరైన మార్గం లేదని చెప్పారు. ఇరుకు మెట్లు, దట్టమైన పొగ మధ్య ఫైర్ సిబ్బందికి లోనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చింది.

గ్రౌండ్ ఫ్లోర్‌లో నగల దుకాణం..

గుల్జార్​ హౌస్​ భవనం మొదటి అంతస్తులో నగల వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్​ హాలిడేస్​ సందర్భంగా వ్యాపారి ఇంటికి బంధువులు వచ్చారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఇంట్లో పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు ఘటనా స్థలంలో స్పృహ తప్పి పడిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి.

తలుపులు పగలగొట్టి..

ఇంట్లోకి పొగ చేరడంతో పాటు.. ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలను ఉపయోగించి ఫస్ట్​ ఫ్లోర్​కు అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేకపోవడంతో తలుపులు పగులగొట్టి స్పృహ తప్పి ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్‌లలో వివిధ హాస్పిటల్స్​కు తరలించారు. వారిలో కొంతమంది మార్గమధ్యలోనే మృతిచెందారు. ఇప్పటివరకు 17మంది చనిపోగా కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విద్యుదాఘాతం వ‌ల్లే..

ఈ ఘటనపై అగ్నిమాప‌క శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యుదాఘాతం వ‌ల్లే గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఇంట్లో చెక్క‌తో చేసిన ప్యానెళ్ల వ‌ల్లే మంట‌లు వ్యాపించాయ‌ని వివరించారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంట‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులో ఉన్న 17 మందిని ర‌క్షించి ఆసుప‌త్రికి తరలించామన్నారు. నిచ్చెన ద్వారా న‌లుగురు పైనుంచి కిందికి వ‌చ్చార‌ని, భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాద నివార‌ణకు సంబంధించి ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌న్నారు. బిల్డింగ్ విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సంబంధించిన మెయిన్ వ‌ద్ద నిత్యం విద్యుదాఘాతం జ‌రుగుతున్న‌ట్లు కార్మికులు చెబుతున్నార‌ని నాగిరెడ్డి వివరించారు.

క్షణాల్లోనే వ్యాపించిన మంటలు..

ఆదివారం ఉదయం 06:16 గంటల ప్రాంతంలో గుల్జార్ హౌస్ చౌరస్తాలో ఉన్న జీ+2 భవనంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. మొఘల్‌పురా అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి.. ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలు మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమై.. క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లను అత్యంత వేగంగా ప్రారంభించారు. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు.. ఈ 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

రంగంలోకి రోబో..

మొత్తం 11 వాహనాలు, ఒక అగ్నిమాపక రోబో, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడానికి.. చిక్కుకున్న వారిని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అధికారులు.. సిబ్బంది చిక్కుకున్న వారిని రక్షించడానికి, మంటలను ఆర్పడానికి.. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించడానికి తీవ్రంగా శ్రమించారు. ఈ సహాయక చర్యలలో ఆధునిక సాంకేతిక పరికరాలు అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబో .. బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు.

సంబంధిత కథనం