Diwali 2024 : దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ?-what are the benefits of buying a new broom on diwali ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Diwali 2024 : దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ?

Diwali 2024 : దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ?

Basani Shiva Kumar HT Telugu
Oct 31, 2024 06:01 PM IST

Diwali 2024 : హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ప్రతీ ఇంట్లో వెలుగులు నింపుతుంది. అలాంటి పండగ రోజు చాలామంది కొత్త చీపురు కొంటారు. అయితే.. దీపావళి నాడు కొత్త చీపురు ఎందుకు కొనాలి.. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం.

దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు
దీపావళి రోజున కొత్త చీపురు ఎందుకు కొంటారు (istockphoto)

దీపావళి పండగను సాక్షాత్తూ లక్ష్మీదేవి పుట్టినరోజుగా భావిస్తారు. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో పూజలు చేసి.. అమ్మవారి అనుగ్రహాన్ని కోరతారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం.. దీపావళి పండగ రోజు కొత్త చీపురును కొనడం మంచిదని భావిస్తారు. దీపావళి రోజు కొత్త చీపురును కొనడానికి అనేక కారణాలున్నాయని పెద్దలు చెబుతారు.

1.తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగానే చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపిణి అయిన చీపురును దీపావళి పండగ రోజు కొనుగోలు చేయడం వల్ల.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లని భావిస్తారు.

2.పండుగ రోజు చీపురు కొనడం వల్ల ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని భావిస్తారు. పూర్వకాలం నుంచి దీపావళి నాడు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తోంది.

3.దీపావళి రోజు చీపురు కొన్నవారు.. దానికి పూజ చేసి ఉపయోగించాలని పెద్దలు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపంగా భావించే చీపురును.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు.

4.చాలామంది చీపురును కాళ్లతో తన్నడం, తొక్కడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పూర్తిగా అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని అంటారు.

5.దీపావళి రోజున దాన ధర్మాలు చేసే సమయంలో.. ఇతరులకు చీపురును దానం చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. చీపురును కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే కాకుండా.. ఎల్లప్పుడూ ఎంతో పవిత్రమైనదిగా భావించాలి.

6.కేవలం చీపురునే కాకుండా.. బంగారం, వెండి, లక్ష్మీ, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయడం వల్ల శక్తి లభిస్తుందని పూర్వీకుల నమ్మకం.

7.పరిశుభ్రమైన వాతావరణం దేవతలను ఆకర్షిస్తుందని పెద్దలు చెబుతారు. పరిశుభ్రతకు మారుపేరు చీపురు అని నమ్ముతారు.

ఇక దీపావళి రోజున కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను కొనుగోలు చేయొద్దని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి అశుభ శక్తిని ఇస్తాయని నమ్ముతారు. మాంసాహాం, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కొనుగోలు చేయొద్దని పెద్దలు చెబుతారు. అలాగే.. ఈరోజు ఎవరి నుంచి డబ్బులు తీసుకోవడం మంచిది కాదని భావిస్తారు.

దీపావళి రోజున ఇంటిలోని ప్రతి మూలను వెలిగించడానికి దీపాలను ఉపయోగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో ఏ ప్రాంతమూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీపావళి రోజున మద్యం సేవించవద్దని సూచిస్తున్నారు. నల్ల రంగు వస్తువులను కొనకుండా.. బంగారం, నారింజ, పసుపు, ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకొని వస్తువులను కొనుగోలు చేయాలని పెద్దలు చెబుతున్నారు.

Whats_app_banner