తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు.. ఆ తేదీల్లో ఎక్కువ వానలు!-weather update rain alert to telangana for coming few day heavy rains on these dates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు.. ఆ తేదీల్లో ఎక్కువ వానలు!

తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు.. ఆ తేదీల్లో ఎక్కువ వానలు!

Anand Sai HT Telugu

తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్‌లో కొట్టిన వానకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో మంగళవారం, బుధవారం వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొన్ని రోజులకు సంబంధించిన వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. 3,4 తేదీల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

జులై 1వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, వరంగల్, హన్మకొండతోపాటుగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

జులై 4వ తేదీవరకు వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. జులై 3, 4వ తేదీల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడని వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు వానలు ఎక్కువ పడనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.

హైదరాబాద్, పరిసర జిల్లాల్లో సోమవారం రాత్రి వర్షాలు కురిశాయి. అల్పపీడనం కారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లో వరదనీటితో చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్డీకపూల్, పంజాగుట్ట, మలక్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమయత్‌నగర్, నారాయణగూడతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు వచ్చి చేరింది.

నగరంలో గరిష్టంగా 27 మి.మీ వర్షపాతం నమోదైంది. బిహెచ్‌ఇఎల్ ఫ్యాక్టరీ, రామచంద్రపురం (27.3 మి.మీ), టోలిచౌకి, కార్వాన్ (26. 4 మి.మీ), ముషీరాబాద్, ఎమ్‌సీహెచ్ బిల్డింగ్, (24.8 మి.మీ), మహదేవ్‌పురా, గాజులరామారం (25.5) మి.మీ, జూబ్లీహిల్స్, షేక్‌పేట్ ప్రాంతం (24.5 మి.మీ) వర్షపాతం నమోదైంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.