IMD Alert : తెలంగాణలోని 10 జిల్లాలకు యెల్లో అలెర్ట్.. ఏపీలో వాతావరణ పరిస్థితి ఇలా..
IMD Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో కొన్ని రోజులు వర్షాలు పడనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని రాయలసీమతోపాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి జోరు వానలు పడనున్నాయి.
IMD Alert : రుతుపవనాలు దేశమంతా చురుగ్గా ఉన్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
10 జిల్లాలకు యెల్లో అలెర్ట్:
తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం యెల్లో అలెర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్ది, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సూర్యాపేట జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
హైదరాబాద్‌లో చిరు జల్లులు:
హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ, 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ఏపీలోనూ వర్షాలు:
రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరియన్ రీజన్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ద్రోణి ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇటు కోస్తా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
నిండుకుండల్లా ప్రాజెక్టులు:
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు నిండు కుండల్లా మారాయి. తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 590 అడుగులకు చేరింది.