Nagarjuna Sagar Project : వేగంగా నిండుతున్న సాగర్‌ - 544 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే-water level of nagarjuna sagar is rising due to heavy floods latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagarjuna Sagar Project : వేగంగా నిండుతున్న సాగర్‌ - 544 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే

Nagarjuna Sagar Project : వేగంగా నిండుతున్న సాగర్‌ - 544 అడుగులు దాటిన నీటిమట్టం, తాజా వివరాలివే

Krishna River Updates : ఎగువ నుంచి వస్తున్న వరదతో సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. పూర్తిగా నిండిన తర్వాత… గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.

నాగార్జున సాగర్ (ఫైల్ ఫొటో)

Nagarjuna Sagar project : ఎగువన కురుస్తున్న వర్షాలు, వరదలతో కృష్ణమ్మ పొంగిపోర్లుతుంది. పైనుంచి వస్తున్న వరదలతో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీశైలం నుంచి భారీగా నాగార్జున సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ కూడా త్వరలోనే నిండిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటల రిపోర్ట్ ప్రకారం…. నీటిమట్టం 544.1 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా… ప్రస్తుతం196.97 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఇన్ ఫ్లో 3,36,543 క్యూసెకులుగా నమోదు కాగా… 23,272 క్యూసెకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలంలో పరిస్థితి ఇలా….

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,09,600 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 5,18,539 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883.8 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 215.81గా ఉండగా….ప్రస్తుతం 208.72గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. ప్రస్తుతం 103.9 అడుగుల నీటిమట్టం ఉంది. 1.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో నిల్ గా ఉండగా… ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత… గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరనుంది.

ఎడమ కాల్వకు నీటి విడుదల….

ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటి విడుదల చేయనున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో సాగర్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాగర్ నుంచి నీటి విడుదల చేయనున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత వానాకాలం, వేసంగి సీజన్లను కోల్పోయిన ఆయకట్టు రైతులు ఈ వానాకాలంపై ఆశలు పెట్టుకున్నారు. మొన్న మొన్నటి దాకా తాగునీటినైనా అందివ్వగలదా అన్న అనుమానాలు వ్యక్తమైన ఎగువున కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ వేగంగా నిండుతోంది. దీంతో ఎడమకాల్వ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సాగర్ జలాశయం శరవేంగా నిండుతుండడం, అనూహ్యమైన ఇన్ ఫ్లో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం కాల్వకు నీరు విడుదల చేయాలని నిర్ణయించడంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలతో పాటు, ఖమ్మం జిల్లాకూ సాగునీరు విడుదల కానుంది.

వాస్తవానికి నాగార్జున సాగర్ప్రా జెక్టు కుడి ఎడమ కాల్వల కింద 22.36 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందాలి. ఒక్క ఎడమ కాల్వ పరిధిలోనే నల్గొండ, ఖమ్మం, క్రిష్ణా జిల్లాలకు సాగుర్ అందుతోంది. నల్గొండ జిల్లా పరిధిలో 3.72 లక్షల ఎకరాలు, ఖమ్మం పరిధిలో 3.46 లక్షల ఎకరాలు, ఏపీలోని క్రిష్ణా జిల్లా పరిధిలో 4.04 లక్షల ఎకరాలు మొత్తంగా ఎడమ కాల్వ కింద 22,24,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ,పూర్తి ఆయకట్టుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీరు అందింది లేదు.

NOTE : ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆయా ప్రాజెక్టుల్లో నీటి నిల్వల గణాంకాలు మారుతుంటాయి. ఆ వివరాలను https://apwrims.ap.gov.in/mis/reservoir/ లింక్ పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చు