Greater Hyderabad : కొత్తగా భవన నిర్మాణం చేస్తున్నారా..! అయితే మీకోసమే ఈ గుడ్ న్యూస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూతన భవన నిర్మాణదారులకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రం జారీ ప్రక్రియను సులభతరం చేసింది. వాటర్ ఫీజబిలిటి ధ్రువపత్రాలు జారీ చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. త్వరితగతిన పత్రాన్ని జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
నూతన భవన నిర్మాణదారులకు హైదరాబాద్ జలమండలి శుభవార్త చెప్పింది. కొత్తగా భవనాలు నిర్మించుకునే వారు జీహెచ్ఎంసీ అనుమతుల కోసం సమర్పించాల్సిన వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాన్ని జారీ చేసే ప్రక్రియను జలమండలి సులభతరం చేసింది.
గ్రేటర్ పరిధిలోని నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజబిలిటీ తో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రం సమర్పించాలి. గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో సీజీఎం జారీ చేసేవారు.
వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. దీన్ని నివారించి, ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని జలమండలి కేంద్ర కార్యాలయం నుంచే చేపట్టేలా మార్పులు చేశారు. ఇందుకోసం వాటర్ ఫీజబిలిటి ధ్రువపత్రాలు జారీ చేయడానికి జలమండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ వినియోగదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రాల కోసం వినియోగదారులు ముందుగా సంబంధిత తమ దగ్గర్లోని సీజీఎంలకు దరఖాస్తులు సమర్పించాలి. వారు 6 రోజుల పాటు వాటిని పరిశీలించి.. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్న కమిటీకి పంపిస్తుంది.
సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు 30 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్దేశిత 5 రోజుల్లో (పని దినాలు) రెవెన్యూ విభాగ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) ధ్రువపత్రాల్ని జారీ చేస్తారు. దీని వల్ల భవనాలు నిర్మించుకునే వాళ్లకు పని, ధ్రుపత్రాల విషయంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ఈ కమిటీ ద్వారా ఈ నెలలో ఇప్పటికే 19 వాటర్ ఫీజబిలిటీ ధ్రువపత్రాల్ని జారీ చేశారు.
స్పెషల్ డ్రైవ్ లో భాగస్వామ్యం కండి: జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే యజ్ఞంలో నగర వాసులందరూ భాగస్వాములు కావాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. మురుగు నీటిలో కరగని వ్యర్థాలను వేయకూడదని సూచించారు. ఆసుపత్రులు, హోటళ్లు, బేకరీలు, మాల్స్, తదితర వాణిజ్య, బహుళ అంతస్తు భవన సముదాయాల నిర్వాహకులు సిల్ట్ చాంబర్లు ఏర్పాటు చేసుకొని వాటిద్వారా సీవరేజ్ కనెక్షన్లను ప్రధాన డ్రై నేజీ పైప్ లైన్ కు అనుసంధానం చేసుకోవాలని తెలిపారు.
పైప్ లైన్ లోకి కరగని వ్యర్థాలు చేరక పోతే మురుగు నీటి ప్రవాహం సాఫీగా ఉంటుందన్నారు. సిల్ట్ ఛాంబర్లను తప్పని సరి చేశామన్న ఆయన... హైదరాబాద్ మనందరి సిటీ అని గుర్తు చేశారు. అలాంటి నగరంలో డ్రైనేజీ ఓవర్ ఫ్లో కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సైతం నగరవాసులపై ఉందని గుర్తు చేశారు.
మరోవైపు సీవరెజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్ లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 65 వేల మ్యాన్ హోల్స్ శుభ్రం చేశారు. దీంతో పాటు 8 వేల ప్రాంతాల్లో 930 కిలో మీటర్ల మేర సీవరెజ్ పైపు లైన్ ను డీ-సిల్టింగ్ పనులు నిర్వహించారు. ఈ ఘనత సాధించినందుకు అధికారులు, సిబ్బందిని ఎండీ అశోక్ రెడ్డి అభినందించారు. ఇదే స్ఫూర్తిని స్పెషల్ డ్రైవ్ ముగింపు వరకు కొనసాగించాలని సూచించారు.
టాపిక్