వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి-warangal thunderstorm kills two lightning strike fatalities in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి

వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి

HT Telugu Desk HT Telugu

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి రైతులు అవస్థలు పడ్డారు. పిడుగులు పడి పంచాయతీ సెక్రటరీ, గొర్ల కాపరి మృతి చెందారు.

వరంగల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం-పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలుల వర్షం కురవగా.. పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉమ్మడి జిల్లాలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలాచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పూర్తిగా చల్లబడింది. వరంగల్ నగరంలో చాలాచోట్లా రోడ్లు నీట మునిగి జనాలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

పిడుగుపడి ఇద్దరు మృతి

మహబూబాబాద్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం పలు చోట్లా పిడుగులు పడ్డాయి. దీంతో ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీతో పాటు మరో గొర్ల కాపరి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన ఏశబోయిన చేరాలు యాదవ్ గొర్ల కాపరిగా పని చేసేవాడు.

రోజువారీలాగే గొర్లను మేతకు తీసుకెళ్లగా.. బుధవారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో చేరాలు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఘటనలో గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం ప్రవీణ్ (28) పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం మధ్యాహ్నం సమయంలో గ్రామంలోని రైతు వేదిక నుంచి నడుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీంతో ప్రవీణ్ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు

అకాల వర్షాల వల్ల చాలా చోట్లా కల్లాల్లోని ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురవగా.. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కూడా తడిసి అన్నదాతలు నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాల్వల గ్రామంలో భారీ వర్షం కురవగా.. అక్కడ కొనుగోలు కేంద్రంలో ఉంచిన వడ్ల బస్తాలు అన్నీ తడిసి పోయాయి.

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఒక్క వానకు తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్లే ధాన్యం తడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపించారు. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

మరో వైపు వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు, బస్తాలు తడిసి పోగా, కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరో ఐదు రోజులు వర్షాలు

భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం ఉదయం ఎండ దంచి కొట్టగా, ఆ తరువాత కొద్దిసేపటికే ఆకాశంలో మబ్బు చేసింది. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్లా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఇదిలాఉంటే ఎండలతో ఉక్కపోతకు గురై జనాలు ఉక్కిరిబిక్కిరవగా.. వాతావరణం చల్లబడటంతో జనాలు కాస్త ఉపశమనం పొందారు. ఇదిలాఉంటే రాబోయే ఐదు రోజులు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో రైతుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం