TGNPDCL : విద్యుత్ సంబంధిత సమస్యలున్నాయా? టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహణ
TGNPDCL : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లోనే ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ప్లాన్ చేశారు.
TGNPDCL : విద్యుత్ సంబంధ సమస్యలతో రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక నుంచి అంత రిస్క్ అవసరం లేకుండానే సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు చెందిన సమస్యలతో వినియోగదారులు ఇదివరకు రోజుల తరబడి ఆఫీసర్ల చుట్టూ తిరిగిన దాఖలాలు ఉండగా, ఆ పరిస్థితికి చెక్ పెట్టేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఎన్పీడీసీఎల్) ఛైర్మన్ అండ్ మేజేజింగ్ డైరెక్టర్(సీఎండీ) కర్నాటి వరుణ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా, విద్యుత్తు సంబంధ సమస్యల కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లోనే ఫిర్యాదులు, వినతులు స్వీకరించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రజావాణి మాదిరిగానే టీజీ ఎన్పీడీసీఎల్ లోని 16 సర్కిళ్ల పరిధిలో ప్రతి సోమవారం విద్యుత్తు ప్రజావాణి నిర్వహించనున్నట్లు సీఎండీ స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి వచ్చే సమస్యలపై రెగ్యులర్ గా మానిటరింగ్ చేసేందుకు రివ్యూలు కూడా నిర్వహించనుండటంతో విద్యుత్తు సంబంధ సమస్యలతో తిరుగుతున్న వారికి కొంత ఊరట లభించనుంది. ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి, ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎండీ తెలిపారు.
అన్ని ముఖ్య ఆఫీసుల్లో ఫిర్యాదులు
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఉండగా, మొత్తంగా 16 సర్కిళ్లలోని అన్ని ముఖ్య కార్యాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ మేరకు సర్కిల్ ఆఫీసులు, డివిజన్, సబ్ డివిజన్ ఆఫీసులు, సెక్షన్ ఆఫీసుల్లోనూ ప్రతి సోమవారం ఆఫీసర్లు అందుబాటులో ఉండనున్నారు. కాగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డివిజన్, ఈఆర్వో, సబ్ డివిజన్, సెక్షన్ ఆఫీసుల్లో ఫిర్యాదులు స్వీకరించనుండగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సర్కిల్ ఆఫీసులో వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సీఎండీ పేర్కొన్నారు.
ప్రతి సమస్యపై రివ్యూ
వినియోగదారులు అందించే సమస్యలు, ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. విద్యుత్తు ప్రజావాణిలో భాగంగా వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ అధికారులకు రెండు రోజుల కిందటనే సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. కింది స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ఏమున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ విద్యుత్తు ప్రజావాణి ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా వినియోగదారులు అందించే ప్రతి సమస్యపైనా మానిటరింగ్ ఉంటుందని, ప్రతి ఫిర్యాదును సమీక్ష సమావేశంలో చర్చించి పరిష్కార మార్గం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, వినియోగదారులకు సేవలందించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)