Police Dog Retires : బిట్టు ది స్నైపర్ డాగ్ కు రిటైర్మెంట్-ఘనంగా వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు
Police Dog Retires : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని బాంబ్ స్క్వాడ్ విభాగంలో దాదాపు 11 ఏళ్ల పాటు పనిచేసిన ఓ జాగిలానికి పోలీస్ అధికారులు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ జాగిలానికి పోలీస్ ఉన్నతాధికారులంతా ఘనమైన వీడ్కోలు పలికారు.
Police Dog Retires : ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ పదవీకాలం పూర్తయ్యాక రిటైర్ అవ్వడం కామన్. ఉద్యోగ విరమణ సందర్భంగా రిటైర్ అవుతున్న ఉద్యోగికి తోటి సిబ్బంది, ఇతర ఉద్యోగులు సన్మానాలు, సత్కారాలు చేయడం కూడా సాధారణమే. కానీ జంతువులకు రిటైర్మెంట్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా? అందులో పోలీస్ ఉన్నతాధికారులు గౌరవ వందనం సమర్పించడం అంటే మామూలు ముచ్చట కాదు కదా. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని బాంబ్ స్క్వాడ్ విభాగంలో దాదాపు 11 ఏళ్ల పాటు పని చేసిన ఓ జాగిలానికి పోలీస్ అధికారులు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎక్కడా లేని విధంగా కుక్కకు రిటైర్మెంట్ ఇచ్చి పోలీసులు దానిని సత్కరించారు. కాగా విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన కుక్కకు పోలీస్ ఉన్నతాధికారులంతా ఘనమైన వీడ్కోలు పలకడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
బిట్టు.. ది స్నైపర్ డాగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో 2013 డిసెంబర్ 26న పోలీసులు ఒక జాగిలాన్ని చేర్చుకున్నారు. దానిని బిట్టు అని పేరు పెట్టారు. కాగా బాంబ్ స్క్వాడ్ లో చేరిన ఆ జాగిలం ప్రధానంగా ప్రధాన మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర వీవీఐపీలు వరంగల్ కమిషనరేట్ లో పర్యటించే సందర్భంగా పేలుడు పదార్థాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతోనే బిట్టును స్నైపర్ డాగ్ గా పిలిచేవారు. కాగా 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ జాగిలం పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవలు అందించగా, దానికి హ్యాంగ్ లర్ గా కానిస్టేబుల్ వ్యవహరించేవాడు. ఆయన ట్రైనింగ్ లో బిట్టు ఇన్నాళ్లు సేవలందించగా, 11 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవడంతో పోలీసులు ఆ జాగిలానికి రిటైర్మెంట్ ప్రకటించారు.
కమిషనరేట్ లో ఫస్ట్ టైమ్
సుదీర్ఘ కాలంగా వరంగల్ కమిషనరేట్‌లో పోలీస్ విభాగానికి సేవలందించిన జాగిలం బిట్టుకు అధికారులు ఉద్యోగ విరమణ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా పోలీస్ జాగిలానికి ఉద్యోగ విరమణ ప్రకటించి, సత్కరించడం రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఇదివరకు జరగగా.. వరంగల్ కమిషనరేట్ లో మాత్రం మొట్టమొదటి సారి బిట్టు రిటైర్మెంట్ ప్రోగ్రామ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా బిట్టు ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఉద్యోగ విరమణ పొందుతున్న జాగిలాన్ని పూల దండలతో సత్కరించారు. గౌరవ సూచకంగా సెల్యూట్ కూడా చేశారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ శాఖలో జాగిలం విభాగం చాలా కీలకమన్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు పేలుడు పదార్థాలతో పాటు మాదక ద్రవ్యాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం