వరంగల్ రైల్వే స్టేషన్ ఈ నెల 22న పునః ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా.. కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా.. ఈ స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రూ.25.41 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ కాజీపేట-విజయవాడ రైలు మార్గంలో ఉంది. న్యూఢిల్లీ, చెన్నై, విజయవాడ, సికింద్రాబాద్‌లను కలుపుతుంది. ప్రతిరోజు సుమారు 137 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. సగటున 31,887 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.
అభివృద్ధిలో భాగంగా.. స్టేషన్ ముఖభాగాన్ని కాకతీయ కళా తోరణం శైలిలో మారుస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లతో కూడిన కొత్త ఫుట్-ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. ప్లాట్‌ఫారాలను ఆధునీకరించారు. కొత్త పైకప్పు వేస్తున్నారు. ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక ఫర్నిచర్‌తో వేచి ఉండే గదులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, కోచ్ ఇండికేటర్లు, ప్రయాణికులకు అనుకూలమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటెడ్ టికెటింగ్ యంత్రాలు, టికెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు క్రమబద్ధీకరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 22వ తేదీన పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సంవత్సరానికి ఈ స్టేషన్ ద్వారా సుమారు రూ.41.09 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం 3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, ఏపీకి వెళ్లే రైళ్లు.. 1వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయి. సికింద్రాబాద్, న్యూఢిల్లీ వైపు వెళ్లే రైళ్లు.. 2, 3వ నంబర్ ప్లాట్‌ఫామ్‌లకు వస్తాయి. అన్ని ప్రధాన రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి. నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ఈ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
సంబంధిత కథనం