Warangal Police : చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు.. వరంగల్ పోలీసుల తీరుపై విమర్శలు!-warangal police register land grabbing case against deceased ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police : చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు.. వరంగల్ పోలీసుల తీరుపై విమర్శలు!

Warangal Police : చనిపోయిన వ్యక్తిపై భూకబ్జా కేసు.. వరంగల్ పోలీసుల తీరుపై విమర్శలు!

HT Telugu Desk HT Telugu

Warangal Police : వరంగల్ నగరంలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలం కిందట చనిపోయిన ఓ వ్యక్తి భూకబ్జాకు ప్రయత్నించాడు! వేరే వ్యక్తికి సంబంధించిన ల్యాండ్‌లో హద్దురాళ్లను తొలగించి.. భూమిని చదును చేసేందుకు యత్నించాడు. అతనిపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బత్తిని చంద్రశేఖర్ (ఫైల్ ఫొటో)

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీసుల వ్యవహారం చూస్తే.. ఆశ్చర్యమే కలుగుతోంది. కొన్నేళ్ల కిందట చనిపోయిన ఓ వ్యక్తిపై వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు భూకబ్జా నమోదు చేశారు. సుమారు తొమ్మిదేళ్ల కిందట ఆయన చనిపోగా.. ఇప్పుడు ఆయనపై భూకబ్జా కేసు నమోదు చేయడం పట్ల అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసుల అక్రమ కేసుల వ్యవహారానికి ఈ ఘటనే సాక్ష్యమని చర్చించుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

అసలేం జరిగింది..?

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సు శివారు సర్వే నెంబర్లు.. 358, 386, అలాగే 199, 200,201 లో సుమారు 23 ఎకరాల భూమి ఉంది. దానిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బత్తిని చంద్రశేఖర్, బత్తిని సంపత్, బొమ్మగాని శ్రీను, వేణు, నాగరాజు అనే వ్యక్తులు తమ భూమిలోకి వచ్చి వివాదం సృష్టిస్తున్నారని.. భూమిలో ఉన్న హద్దురాళ్లను తొలగించడంతో పాటు భూమిని చదును చేసి చంపుతామని బెదిరిస్తున్నారంటూ.. హంటర్ రోడ్డుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జనవరి 21న ఆమె మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రాథమిక విచారణ ఏమీ లేకుండానే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ మేరకు పైన పేర్కొన్న ఐదుగురిపై బీఎన్ఎస్ 324(4), 329(3), 351(2), r/w 3(5) సెక్షన్ల కింద 47/2025 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

చనిపోయిన వ్యక్తే ఏ1..

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అందులో ఏ1 గా బత్తిని చంద్రశేఖర్, ఏ2 బత్తిని సంపత్, ఏ3 బొమ్మగాని శ్రీను, ఏ4 వేణు, ఏ5 నాగరాజు పేర్లను చేర్చారు. పోలీసులు ప్రలోభాలకు తలొగ్గి ప్రాథమిక విచారణ లేకుండానే పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ఏ1 గా ఉన్న బత్తిని చంద్రశేఖర్ కొన్నాళ్ల కిందట చనిపోయారు. ఆయననే ఏ1గా చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తీవ్ర ఆరోపణలకు తావిచ్చింది. చంద్రశేఖర్ దాదాపు తొమ్మిదేళ్ల కిందట చనిపోగా.. ఆయన పేరున ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 2016 సెప్టెంబర్ 17న ఆయన హైదరాబాద్ లో చనిపోగా.. జీహెచ్ఎంసీ డెత్ సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. చనిపోయిన తొమ్మిదేళ్లకు చంద్రశేఖర్‌పై కేసు నమోదు కాగా.. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

పోలీసుల తీరుపై విమర్శలు..

చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు అయిన ఘటన వరంగల్ నగరంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను ప్రశ్నిస్తే.. తమ ఇష్టమొచ్చినట్టు కేసు నమోదు చేస్తామని బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న కొంతమంది పోలీస్ అధికారుల వల్ల.. మొత్తం కమిషనరేట్ కు ఉన్న మంచి పేరు కాస్త చెడిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపించి.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

HT Telugu Desk