Warangal Police: శభాష్ పోలీస్.. రాఖీతో అక్కాతమ్ముళ్లను కలిపిన ఎస్సై
Warangal Police: మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెబుతారు. కానీ.. చాలామంది దాన్ని పెడచెవిన పెడతారు. కొందరు మాత్రమే ఆ సూత్రాన్ని అనుసరించి.. జఠిలమైన సమస్యలను సులువుగా పరిష్కరిస్తారు. తాజాగా ఓ సమస్యను అలాగే పరిష్కరించారు ఓ పోలీస్ అధికారి.
వారిద్దరు అక్కా తమ్ముళ్లు. కానీ.. ఏదో విషయంలో గొడవ జరిగింది. ఈ వివాదం కారణంగా.. ఒకరినొకరు చంపుకుంటాం అనే వరకు వెళ్లారు. ఇది కాస్త పొలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఫిర్యాదు వచ్చినప్పుడు సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసి రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తారు. అప్పుడు కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ.. వరంగల్ నగరంలో పోలీస్ అధికారి అలా చేయలేదు. విషయాన్ని దర్యాప్తు, కోర్టు వరకు తీసుకెళ్లకుండా చాలా సింపుల్‌గా.. సాఫ్ట్‌గా పరిష్కరించారు.
గొడవ పడి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అక్కాతమ్ముళ్లను మిల్స్‌కాలనీ ఎస్సై సురేష్ రాఖీతో ఒక్కటి చేశారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ కోయవీధిలో ఉంటున్న కోటమ్మ, ఆమె తమ్ముడు ఏడుకొండలు మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ వివాదం కారణంగా ఒకరినొకరు చంపుతామంటూ బెదిరించుకున్నారు. ఈ గొడవ కాస్త పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు వరకు వెళ్లింది. దీంతో మిల్స్ కాలనీ ఎస్సై సురేష్ వారిద్దరినీ ఠాణాకు పిలిపించారు. ఇద్దరి వాదన విని సయోధ్య కుదిర్చారు. అక్క కోటమ్మతో తమ్ముడు ఏడుకొండలుకు రాఖీ కట్టించారు. దీంతో వివాదం సద్దుమణిగి.. ఇద్దరు కలిసిపోయారు.
అక్కాతమ్ముళ్ల గొడవను పరిష్కరించి.. సయోధ్య కుదిర్చిన ఎస్సై సురేష్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. ఖాకీ డ్రెస్ అంటే కఠువుగా ఉండేది కాదని.. ఆ డ్రెస్ వెనక మంచి మనసున్న గుండె కూడా ఉంటుందని పలువురు అభినందిస్తున్నారు. ప్రతీ విషయాన్ని ఒకే కోణంలో చూడొద్దని.. కొన్నింటిని మానవీయ కోణంలో చూస్తే.. పరిష్కారం లభిస్తుందని.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని కొందరు పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.