Warangal : న్యూ ఇయర్ వేడుకలపై వరంగల్ పోలీసుల ఆంక్షలు.. తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు!
Warangal : ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సంబరాలకు వరంగల్ పోలీసులకు కండీషన్స్ పెట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని.. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. డిసెంబర్ 31న సంబరాలను అర్ధరాత్రి 12.30 గంటలలోపే క్లోజ్ చేయాలన్నారు.
డిసెంబర్ 31న రాత్రి నిర్వహించే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. వరంగల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, క్రైమ్, షీ టీమ్స్ తదితర వింగ్‌ల పోలీస్ ఆఫీసర్లతో పెట్రోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు కమిషనరేట్ లోని ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ జోన్ పోలీస్ ఆఫీసర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకలు జరిగే సమయంలో ట్రాఫిక్ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇండ్ల వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ ఆఫీసర్లకు సూచించారు.
తాగి రోడ్డెక్కితే అంతే..
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరున యువకులు మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే.. సీరియస్ యాక్షన్ ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు.. జైలు శిక్ష కూడా ఉంటుందని, ఓవర్ స్పీడ్ తో పాటు రోడ్లుపై వెళ్లే వారికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు రాకుండా.. ట్రాఫిక్ సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటీతో పాటు గ్రామీణా ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనీఖీలు నిర్వహిస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామన్నారు.
పర్మిషన్ తప్పనిసరి..
నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఏర్పాటు చేసే స్పెషల్ ఈవెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని వరంగల్ సీపీ స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్నారు. కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాలనైనా వినియోగిస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ సీపీ హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆకాంక్షించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)