Warangal Traffic Challans: చలాన్ల చెల్లింపులపై వరంగల్‌ పోలీసుల ఫోకస్..-warangal police focus on pending traffic challan payments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Traffic Challans: చలాన్ల చెల్లింపులపై వరంగల్‌ పోలీసుల ఫోకస్..

Warangal Traffic Challans: చలాన్ల చెల్లింపులపై వరంగల్‌ పోలీసుల ఫోకస్..

HT Telugu Desk HT Telugu
Jan 17, 2024 12:10 PM IST

Warangal Traffic Challans: వాహనదారుల పెండింగ్ చాలాన్లు క్లియర్ చేయించడంపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఫోకస్ పెట్టారు.

ట్రాఫిక్ చలాన్లపై పోలీసుల దృష్టి
ట్రాఫిక్ చలాన్లపై పోలీసుల దృష్టి

Warangal Traffic Challans: రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెండింగ్ చాలాన్లు పేరుకు పోగా డిసెంబర్ 26 నుంచి డిస్కౌంట్ చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆఫర్ ని వినియోగించుకునేందుకు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రాగా.. పోలీసులు కూడా వెహికిల్ చెకింగ్ లు చేపట్టి చాలాన్లు క్లియర్ చేయించే పనిలో పడ్డారు.

ఈ మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తంగా రూ.20.31 కోట్లకు పైగా వసూలు చేశారు. రికార్డు స్థాయిలో చాలాన్లు క్లియర్ కాగా.. ఈ నెలాఖరు వరకు సమయం ఉండటంతో పోలీసులు సాధ్యమైనన్ని ఎక్కువ చెల్లింపులు జరిగేలా తనిఖీలు చేపడుతున్నారు.

20 రోజులు.. రూ.20.31 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో కలిపి దాదాపు 20 లక్షలకుపైగా చాలాన్లు పెండింగ్ లో ఉండగా.. రూ.50 కోట్ల కు పైగా బకాయిలు పేరుకుపోయాయి.

దీంతో వరంగల్ పోలీసులు చాలాన్లు క్లియర్ చేయించేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించారు. కొంతమంది రాయితీలు వినియోగించుకునేందుకు సొంతంగా చెల్లింపులు కూడా చేసారు. మీ సేవ, ఆన్ లైన్ ఈచాలాన్, పే టీఎం తదితర సేవలు వినియోగించుకున్నారు.

ఇలా డిసెంబర్ 26 నుంచి సంక్రాంతి పండుగ వరకు సుమారు 8 లక్షల చలాన్ల వరకు క్లియర్ కాగా.. మొత్తంగా రూ.20.31 కోట్లకుపైగా వసూలు అయ్యాయి. కేవలం 20 రోజుల్లోనే ఇంత పెద్దఎత్తున చాలాన్లు వసూలు కావడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఆఫర్లు కూడా ఇచ్చినప్పటికీ ఆ సమయంలో ఇంతలా స్పందన రాలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మరోసారి గడువు పొడగించడంతో మరిన్ని చాలాన్లు చెల్లింపులు జరిగేందుకు కృషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి వాహనదారులు చాలాన్లు చెల్లించేలా మోటివేట్ చేస్తున్నారు.

ఈ నెల 31 వరకు గడువు

రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లకు పైగా చాలాన్లు పెండింగ్ లో ఉండగా.. ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. ఇందులో ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, కార్లు, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చి చలానాలు చెల్లించాల్సిందిగా సూచించింది.

ఈ మేరకు మొదటి విడతలో డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు సమయం ఇచ్చింది. దీంతో జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఇంకా పెద్ద మొత్తంలో పెండింగ్ చాలాన్లు మిగిలి ఉండగా.. ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది.

జనవరి 31 వరకు చాలాన్లు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. దీంతో గడువులోగా వాహన దారులు పెండింగ్ చాలాన్లు చెల్లించి రాయితీలను సద్వినియోగం చేసుకో వాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner