Warangal Police : టిప్పు సుల్తాన్ వారసుడినంటూ నిరుద్యోగులకు టోకరా.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు-warangal police arrest man who faked being tipu sultan heir ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police : టిప్పు సుల్తాన్ వారసుడినంటూ నిరుద్యోగులకు టోకరా.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

Warangal Police : టిప్పు సుల్తాన్ వారసుడినంటూ నిరుద్యోగులకు టోకరా.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu

Warangal Police : తాను టిప్పు సుల్తాన్ వారసుడినంటూ ఓ డాక్టర్ మోసాలకు తెరలేపాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించాడు. అనంతరం వారి నుంచి రూ.5.56 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా అతన్ని అరెస్టు చేశారు.

అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా

తమిళనాడు రాష్ట్రం కుంభం ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా.. 2010లో రష్యాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆ తరువాత సంగారెడ్డి జిల్లాకు వచ్చి అక్కడ ఓ ఫార్మసీ కాలేజీలో సీఎంవోగా పని చేశాడు. అనంతరం కరీంనగర్, హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లో పని చేశాడు. ఆ తరువాత 2020లో జనగామలోని హనుమకొండ మార్గంలో కేకే హాస్పిటల్ పేరున ప్రైవేటు క్లీనిక్ ఓపెన్ చేసి నిర్వహిస్తున్నాడు.

టిపు సుల్తాన్ పేరుతో..

జనగామలో హాస్పిటల్ నడుపుతున్న సుల్తాన్ రాజా తన వద్దకు చికిత్స కోసం వచ్చే అమాయకులతో పరిచయం పెంచుకున్నాడు. వారితో మాట కలిపి తాను టిప్పు సుల్తాన్ వారసుడినని, టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్ తానేనంటూ అందరినీ నమ్మించాడు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్ కు రూ.700 కోట్లు కేటాయించిందని, ఆ డబ్బులతో ట్రస్ట్ పేరిట హైదరాబాద్‌లో మెడికల్ కాలేజీ నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు. అందులో వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ అమాయకులను నమ్మించాడు.

కోట్ల రూపాయలు టోకరా..

కర్నాటక ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు ట్రస్ట్‌కు వస్తున్నాయని ఓ డీడీ తయారు చేసిన అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా.. బిల్డింగ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని జనగామ పట్టణానికి చెందిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ వసీం అక్తర్‌కు చెప్పాడు. కాంట్రాక్ట్ ఇప్పించేందుకు వసీం అక్తర్‌తో బేరం కుదుర్చుకుని రూ.1.17 కోట్లు తీసుకున్నాడు. తన పలుకుబడితో హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. జనగామకు చెందిన మేకల ఆనంద్ కుమార్ నుంచి 2021లో రూ.3.75 లక్షలు, గాడెపాక రాజ్ కుమార్ వద్ద నుంచి రూ.5.50 లక్షలు, పిపిరె సిద్దార్థ నుంచి రూ.5.50 లక్షలు, మరో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.14.75 లక్షల చొప్పున వసూలు చేశాడు.

ఉద్యోగాలు, కాంట్రాక్టులు రాలేదు..

2023లో జనగామకు చెందిన మారబోయిన పాండు నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఎస్వీఎన్ చారీ అలియాస్ ఆచార్య(ఆడిటర్) వద్ద రూ.1.70 కోట్లు, రాజు అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు, 2014లో కరీంనగర్ కు చెందిన సీహెచ్ అనిల్ వద్ద రూ.2 కోట్లు తీసుకున్నాడు. కానీ అబ్దుల్ రహీం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్టులు రాకపోవడంతో వారంతా అతడిని నిలదీశారు. దీంతో తన అకౌంట్ కు ఇప్పుడే డబ్బులు వస్తున్నాయంటూ ఇంకో ఫోన్ నుంచి తన ఫోన్ కు మెసేజ్ లు పంపించుకుని బాధితులకు చెప్పి నమ్మించాడు. ఇలా మొత్తంగా రూ.5.56 కోట్లకు పైగా లాగేశాడు.

ఎట్టకేలకు అరెస్ట్..

బాధితుల నుంచి రూ.5.56 కోట్లకు పైగా వసూలు చేసిన అబ్దుల్ రహీం.. దాదాపు 8 నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితులు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా జనగామలోని కేకే ఆసుపత్రికి వచ్చాడు. సీఐ దామోదర్ రెడ్డి, తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. అసలు విషయాన్ని అబ్దుల్ రహీం సుల్తాన్ రాజా ఒప్పుకున్నాడు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.