వరంగల్ మంగళికుంట డాక్టర్స్ కాలనీ –2 మార్కండేయ వీధికి చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్.. హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని ఓ జిమ్‌లో దాదాపు ఐదేళ్ల నుంచి బాడీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్నాడు. అతనే జిమ్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలాఉంటే బాడీ బిల్డింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో శ్రావణ్ కుమార్‌కు ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. శరీర దృఢత్వంతో పాటు ఆకృతి కోసం స్టెరాయిడ్స్ వినియోగించాలని సూచించాడు. ఈ మేరకు కొన్ని స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్స్ శ్రావణ్ కుమార్‌కు విక్రయించాడు. అప్పటినుంచి శ్రావణ్ కుమార్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ.. జిమ్‌లో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు.
శ్రావణ్ కుమార్ కు ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా ఏపీలోని వైజాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. వారి నుంచి శ్రావణ్ కుమార్ కొనుగోలు చేసేవాడు. ఎలాంటి లైసెన్స్, అనుమతులు లేకుండా మణికంఠ, ఆనంద్ స్టెరాయిడ్స్ దందా చేస్తుండగా.. వారి నుంచి ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా శ్రావణ్ కుమార్ స్టెరాయిడ్స్ పొందేవాడు. తాను తీసుకోవడంతో పాటు బాడీ బిల్డింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న యువకులకు కూడా వాటిని విక్రయించడం మొదలుపెట్టాడు. స్టెరాయిడ్స్ విక్రయంతోనూ డబ్బులు వస్తుండటంతో.. దానినే ఆదాయ మార్గంగా ఎంచుకుని శ్రావణ్ కుమార్ కూడా దందాలో భాగమయ్యాడు.
బాడీ బిల్డింగ్ కం జిమ్ ట్రైనర్ గా చేస్తున్న శ్రావణ్ కుమార్.. ఐదేళ్ల నుంచి స్టెరాయిడ్స్ వాడుతున్నాడు. అప్పటినుంచే ఇతర యువకులకు కూడా వాటిని అలవాటు చేశాడు. ఈ క్రమంలో వరంగల్ మట్వాడా పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం సాయంత్రం మట్వాడా పోలీసులు శ్రావణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారణ జరపగా.. అసలు విషయాన్ని శ్రావణ్ కుమార్ ఒప్పుకున్నాడు. శ్రావణ్ కుమార్ నుంచి రూ.20 వేల విలువైన స్టెరాయిడ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రావణ్ కుమార్ అరెస్ట్ కాగా.. మరో ముగ్గురు నిందితులైన ప్రశాంత్, మణికంఠ, ఆనంద్ పరారీలో ఉన్నట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ వివరించారు.
తక్కువ సమయంలో శరీర దృఢత్వం కోసం స్టెరాయిడ్స్ లాంటివి వాడితే.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు చెబుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవ్వడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఏసీపీ నందిరాం నాయక్ వివరించారు. నిందితుడు శ్రావణ్ కుమార్ పై కాస్మొటిక్స్ అండ్ డ్రగ్స్ యాక్ట్ 1940 సెక్షన్ 18 ప్రకారం కేసు నమోదు చేశామని.. మిగతా నిందితులను కూడా తొందర్లోనే పట్టుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. స్టెరాయిడ్స్ గుట్టురట్టు చేసిన మట్వాడా పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం