ఆరుగాలం కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతన్నను కొందరు దుండగులు నిండా ముంచుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి నకిలీ పురుగు మందులు, ఎరువులు అంటగట్టి అన్నదాతలను నష్టాల ఊబిలోకి నెడుతున్నారు. ఇలా ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను వరంగల్ టాస్క్ ఫోర్స్, మట్వాడ పోలీసులు పట్టుకున్నారు.
తొమ్మిది మంది సభ్యుల ముఠాలో ఒకరు పరారీలో, మరొకరు జైలులో ఉండగా.. మిగతా ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వారి నుంచి సుమారు 78 లక్షల 63 వేల రూపాయల విలువ గల గడువు తీరిన, నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల తయారీ మిషనరీ, ప్రింటింగ్ సామగ్రి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం కమిషనరేట్ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
వరంగల్ మట్వాడకు చెందిన ఇరుకుళ్ల వేదప్రకాశ్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉండే పురుగు మందుల వ్యాపారస్తులతో పాటు పురుగు మందుల కంపెనీ ప్రతినిధి, వరంగల్ లక్ష్మీపురానికి చెందిన మహ్మద్ సిద్ధీక్ అలీ నుంచి కాలం తీరిన పురుగు మందులను కొనుగోలు చేసేవాడు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మడుగు ప్రాంతానికి చెందిన ఆళ్లచేరువు శేఖర్, వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పొదిళ్ళ సాంబయ్య, విష్ణు వర్థన్, హైదరాబాద్ కు చెందిన ముద్దగుల ఆదిత్య నుంచి ప్రముఖ పురుగు మందుల కంపెనీలైన ధనూక, టాటా, రైల్స్, బెయర్, అడ్మా తదితర కంపెనీ పేర్లతో తయారు చేసిన నకిలీ పురుగు మందులను కొనుగోలు చేసేవాడు.
ఈ విధంగా సేకరించిన మందులను మిగతా వ్యాపారస్తులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన నూక రాజేష్ ఆలియాస్ రాజు, కరీంనగర్ కు చెందిన యల్లం సదాశివుడు, ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన ఎండీ రఫీక్ ద్వారా రైతులకు అంటగట్టేవారు. ఇలా మోసాలకు పాల్పడుతుండటంతో కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రైతులకు కల్తీ, కాలం చెల్లిన పురుగు పురుగులు అమ్ముతుండటంతో బాధిత రైతులు విషయాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టాస్క్ ఫోర్స్, మట్వాడ పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా శనివారం మధ్యాహ్నం మట్వాడ బోడ్రాయి ప్రాంతంలోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ల వేద ప్రకాశ్ ఇంటిలో సోదా చేశారు. మరో ముగ్గురు నిందితులు సిద్దిక్, రాజేష్, సదాశివుడులను అదుపులోకి తీసుకోని వారి ఇంటి నుంచి పెద్ద మొత్తం నకిలీ, గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు వేద ప్రకాశ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆళ్ళచెరువు శేఖర్, విష్ణువర్ధన్‌ల గౌడోన్ లపై టాస్క్‌ఫోర్స్, మట్వాడా పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తం నకిలీ పురుగు మందులు, వీటి తయారికి వినియోగించే యంత్ర సామగ్రి, లేబుళ్ళు, కల్తీ విత్తనాలు, రెండు కార్లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా విష్ణు వర్ధన్ పరారీలో ఉండగా.. హైదరాబాద్ కు చెందిన ముద్ధగుల ఆదిత్య జైలులో ఉన్నాడు. దీంతో మిగతా నిందితులను మట్వాడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపగా వారు అసలు విషయాన్ని ఒప్పుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడితో పాటు సదాశివుడు, రాజు, ఆదిత్య గతంలోను పలు కేసుల్లో నిందితులుగా ఉండటం గమనార్హం. రైతులకు కల్తీ పురుగు మందులు అమ్ముతున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్, వరంగల్ ఏసీపీలు మధుసూదన్, నందిరామ్ నాయక్, సీఐలు ఎస్.రాజు, గోపి, ఎస్సైలు వంశీకృష్ణ, నవీన్, ఆర్‌ఎస్‌ఐ భాను ప్రకాశ్ , ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ సురేష్, సురేందర్, సాంబరాజు, శ్రీనివాస్, సతీష్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.