TS Rains : తెలంగాణపై మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్- పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
TS Rains : మిచౌంత్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
TS Rains : తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ స్పష్టం చేసింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు బలమైన గాలులు వీస్తుండటంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో ఈదులగాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రేపు ఆరెంజ్ అలెర్ట్
అతి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలతో పాటు నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలతో కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పెరగనున్న చలి తీవ్రత
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. కాగా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకునే అవకాశం ఉందని చెప్పింది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)