Warangal Electrocution : పండుగ వేళ తీవ్ర విషాదం- విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు దుర్మరణం
Warangal Electrocution : వరంగల్ జిల్లా మోత్యతండాలో పండుగ పూట విషాదం అలుముకుంది. దుర్గమ్మ సంబరాలకు టెంట్ వేస్తుండా విద్యుత్ వైర్ తెగిపడింగి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Warangal Electrocution : దుర్గమ్మ పండుగ వేళ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యతండాలో దారుణం జరిగింది. పండుగకు సిద్ధమవుతున్న వేళ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతానికి(Electrocution) గురై ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలుడు మృత్యువుతో పోరాడున్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరగగా.. అనూహ్య ఘటనతో ఊరు మొత్తం ఒక్కసారిగా బోరున విలపించింది. పండుగ జరుపుకుందామన్న సంతోషాన్ని వదిలి మరణ వార్తతో కన్నీళ్లు పెట్టుకుంది.
వరంగల్(Warangal Electrocution) జిల్లా పర్వతగిరి మండలం మోత్య తండాలో మంగళవారం దుర్గమ్మ గుడి పండుగ (Durgamma Festival)నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆలయం ముందు కొంత మంది కలిసి టెంట్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటి పైనున్న 11 కేవీ విద్యుత్తు తీగ తెగి పడింది. అప్పటికీ కరెంట్ సప్లై జరుగుతుండటంతో ఆ వైర్ తగిలి ఓ బాలుగు సహా నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్ గురయ్యారు. ఇందులో భూక్య దేవేందర్(32), బానోత్ అనిల్(20) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భూక్య రవి(30) అనే మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. భూక్య రవి కొడుకు భూక్య జశ్వంత్ ఆరేళ్ల బాలుడు కూడా గాయపడగా.. హుటాహుటిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో జశ్వంత్ పరిస్థితి విషమంగా ఉండగా.. ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా రాయపర్తి మండలం జగన్నాథపల్లి కొత్త తండాకు చెందిన గుగులోతు దేవేందర్ తన బావ మరిది భూక్య రవి దుర్గమ్మ పండుగ కోసం పిలవడంతో ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. పర్వతగిరి మండలం సుందర్ నాయక్ తండాకు చెందిన బానోత్ గుడి ముందు టెంట్ వేసేందుకు వచ్చాడు. వారంతా ఒక్కచోట ఉండి టెంట్ వేయిస్తుండగా.. విద్యుత్తు తీగ తెగి పడి ప్రమాదానికి కారణమైంది.
గ్రామస్థుల ఆందోళన
విద్యుత్తు తీగ(Current Wire) తెగిపడటానికి సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మోత్య తండా ప్రజలు ఆరోపించారు. ఈ మేరకు ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఆ ప్రమాదంలో తన తమ్ముడు రవితో పాటు బావ దేవేందర్, సునీల్ మృతి చెందారని, జశ్వంత్ గాయాలపాలయ్యాడని రవి అన్న భూక్య వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై వెంకన్న వివరించారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. మోత్య తండాలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సంబంధిత అధికారులు చాలాసేపటి వరకు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో రాత్రంతా ఆ తండాలో చీకట్లు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు, పండుగ కోసం వచ్చి బంధువులు మోత్య తండాలో(Motya Tanda) ఆందోళనకు దిగారు. విద్యుత్తు శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వదులుగా ఉన్న విద్యుత్తు తీగలను అధికారులు ముందుగా సరి చేసి ఉంటే ఇంతటి పెను ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని, తండా వాసులు విలపించారు. ప్రమాదంలో మరణించిన భూక్య రవి తల్లిదండ్రులు భూక్య బాషా, కైకమ్మ, భార్య జ్యోతి, ఆరేళ్ల కుమారుడు జశ్వంత్ ఉన్నారు. రవి విద్యుదాఘాతంతో చనిపోవడం, ఆరేళ్ల బాలుడు జశ్వంత్ మృత్యువుతో పోరాడుతుండటంతో తల్లి జ్యోతి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ప్రమాద విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం రాత్రి తండాకు చేరుకున్నారు. రోదనలతో విషాదం అలుముకున్న తండాను చూసి చలించిపోయారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయడంతో పాటు మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి కూడా వెళ్లారు. ఎంజీఎం(Warangal MGM) డాక్టర్లతో మాట్లాడి బాలుడు జశ్వంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తీవ్ర గాయాలతో బాలుడు జశ్వంత్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతుండగా.. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు ఎమ్మెల్యే నాగరాజుకు వివరించారు. దీంతో బాలుడు జశ్వంత్ కు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎంజీఎం ఆర్ఎంవో డా.మురళిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశించారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం