Minister Konda Surekha : ఐ హాస్పిటల్ సిబ్బందిని హడలెత్తించిన మంత్రి, పలువురికి నోటీసులు జారీ
Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ఆకస్మిక తనిఖీలతో అధికారులను హతలెత్తించారు. సోమవారం వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. నిర్లక్ష్యంగా పలువురికి నోటీసులు జారీ చేశారు.
Minister Konda Surekha : వరంగల్ లోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బంది తీరుపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు సిబ్బందికి నోటీసులు జారీ చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వరంగల్ లోని రీజినల్ ఐ హాస్పిటల్ ను కలెక్టర్ సత్య శారదా, ఇతర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కాగా చాలామంది డాక్టర్లు సమయపాలన పాటించకపోవడంతో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించిన సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సత్యశారదను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
ఆసుపత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్ మొత్తం కలియ తిరుగుతూ ఒక్కో విభాగానికి సంబంధించిన రికార్డులు పరిశీలించి, అక్కడి సిబ్బంది తీరు పట్ల అసహనానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసి, వారానికొకసారి కలెక్టర్ ఆ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఒక్కసారిగా మంత్రి కొండా సురేఖ ఆసుపత్రిలో ప్రతి విభాగంలో కలియ తిరుగుతూ హడలెత్తించడంతో కొందరు డాక్టర్లు, సిబ్బంది హడలెత్తిపోయారు.
ఐ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం: మంత్రి కొండా సురేఖ
ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో తొందర్లోనే ఐ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆసుపత్రిని విజిట్ చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులను ప్రభుత్వమే అందిస్తోందని, కాబట్టి ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు డ్యూటీ సమయంలో సరైన సేవలందించాలని సూచించారు.
ఆసుపత్రి మొదటి అంతస్తు పరిశీలించి, ఖాళీగా ఉంచకుండా రోగులకు వైద్య సేవలు అందించేందుకు వినియోగించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఎక్కడా అపరిశుభ్ర వాతావరణం కనిపించకుండా ప్రతిరోజు శుభ్రం చేయించాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ పిచ్చి మొక్కలతో నిండి ఉన్నాయన్ని, విష సర్పాలు తిరిగే అవకాశం ఉన్నందున ఆ పిచ్చి మొక్కలన్నీ తొలగించాలని ఆదేశించారు. హాస్పిటల్ బిల్డింగ్ పాత బడిందని, వెంటనే మరమ్మతులు, పెయింటింగ్ పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ భరత్ ను మంత్రి సురేఖ ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ సత్యశారద, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం