MGM Special OP Services: వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు-warangal mgm special op services for disabled ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mgm Special Op Services: వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు

MGM Special OP Services: వరంగల్ ఎంజీఎంలో దివ్యాంగులకు ప్రత్యేకంగా ఓపీ సేవలు

HT Telugu Desk HT Telugu
Jan 17, 2024 12:28 PM IST

MGM Special OP Services: వరంగల్‌ ఎంజిఎం ప్రభుత్వాస్పత్రిలో దివ్యాంగుల కోసం ప్రత్యేకగా ఓపీ సేవలు అందిస్తున్నారు.

ఎంజిఎంలో దివ్యాంగులకు ప్రత్యేక ఓపీ సేవలు
ఎంజిఎంలో దివ్యాంగులకు ప్రత్యేక ఓపీ సేవలు

MGM Special OP Services: ఉత్తర తెలంగాణ ప్రజలకు ఏ జబ్బు వచ్చినా.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రే పెద్ద దిక్కుగా నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్ తో పాటు చుట్టపక్కల జిల్లాలు, పక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు ఇక్కడికి తరలివస్తుంటారు. అందులో దివ్యాంగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుండటంతో సాధారణ రోగులతో లైన్లలో ఎదురుచూడటం వారికి ఇబ్బందిగా మారుతోంది.

దీంతోనే వరంగల్ ఎంజీఎం అధికారులు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఏదైనా వైకల్యం ఉన్నవారంతా సాధారణ రోగులతో కాకుండా డాక్టర్లను సంప్రదించేందుకు స్పెషల్​ గా దివ్యాంగుల ఓపీ విభాగాన్ని ప్రారంభించారు. ఇందులో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని, ఈ విభాగాన్ని కేవలం దివ్యాంగుల కోసమే ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు చెబుతున్నారు.

నిత్యం వందల మందికి సేవలు

సాధారణంగా వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిరోజు సుమారు 3 వేల వరకు ఓపీ నమోదు అవుతుంటుంది. వివిధ సేవల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో ఎంజీఎం ఎప్పుడూ కిటకిటలాడుతుంటుంది. కాగా ఓపీ సేవల కోసం వచ్చే జనాల్లో దివ్యాంగుల సంఖ్య కూడా వందల్లోనే ఉంటోంది. వారికి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో అవస్థలు పడుతూ డాక్టర్లను సంప్రదించాల్సి వస్తోంది.

డాక్టర్లను కలిసేంత వరకు అందరిలా క్యూ లైన్లలో వేచి ఉండటం, డాక్టర్లను సంప్రదించేంత వరకు ఓపిగ్గా ఉండటం దివ్యాంగులకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. దీంతోనే దివ్యాంగుల అవస్థలను గుర్తించిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డా.వి.చంద్రశేఖర్​ ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఎంజీఎం ఆర్​ఎంవోలు, ఇతర డాక్టర్ల సలహాలు, సూచనలతో ప్రత్యేక ఓపీకి శ్రీకారం చుట్టారు.

ప్రతి రోజూ సేవలు

వరంగల్ ఎంజీఎంలో రెండు రోజుల కిందటే దివ్యాంగుల ఓపీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ దివ్యాంగుల ఓపీ విభాగంలో అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఒక్క ఆదివారం మినహా మిగతా ఆరు రోజులు ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, దివ్యాంగులు నేరుగా వచ్చి ఇక్కడ వైద్యులను సంప్రదించవచ్చని సూచిస్తున్నారు. నిత్యం వందల మంది వచ్చి ఇక్కడ ఓపీ చూపించుకుంటున్నారని, మిగతా అనారోగ్య సమస్యలు ఉన్న దివ్యాంగ పేషెంట్లు ప్రత్యేక విభాగంలో ఉచిత వైద్యం పొందాలని డాక్టర్లు చెబుతున్నారు.

ప్రత్యేక ఓపీ విభాగం ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే వందల మంది దివ్యాంగులు ఇక్కడ సేవలు వినియోగించుకున్నారు. తమకు ఇబ్బందులు కలగకుండా డాక్టర్లు చేస్తున్న కృషికి ధన్యవాదాలు చెబుతున్నారు దివ్యాంగులు.

జిల్లా కలెక్టర్​ ఆదేశాలతోనే దివ్యాంగులకు ప్రత్యేక ఓపీ వైద్య సేవలను ప్రారంభించినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్​ తెలిపారు. దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner