Warangal Police : ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదన..! వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీకి ‘హోం మినిస్టర్‌ మెడల్’-warangal intelligence dsp got union home ministers medal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police : ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదన..! వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీకి ‘హోం మినిస్టర్‌ మెడల్’

Warangal Police : ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదన..! వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీకి ‘హోం మినిస్టర్‌ మెడల్’

HT Telugu Desk HT Telugu
Nov 02, 2024 07:01 AM IST

వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీ సత్యనారాయణకు అరుదైన గుర్తింపు దక్కింది. ఆసిఫాబాద్​ సమత కేసు ఛేదించినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హోమ్​ మినిస్టర్స్​ అవార్డు వరించింది. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈసారి తెలంగాణ నుంచి 26 మందికి దక్కాయి.

 డీఎస్పీ సత్యనారాయణ
డీఎస్పీ సత్యనారాయణ

దాదాపు ఐదేళ్ల కిందట కుమ్రంభీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలో కలకలం రేపిన ‘సమత’ హత్యాచారం కేసును ఛేదించిన అప్పటి డీఎస్పీ సత్యనారాయణకు కేంద్ర ప్రభుత్వం హోం మినిస్టర్స్ అవార్డు ప్రకటించింది. కేసును అతి తక్కువ సమయంలో సాల్వ్​ చేయడంతో పాటు దోషులకు మరణ శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించడంలో ప్రతిభ చూపినందుకు ఈ మేరకు కేంద్రం ‘యూనియన్​ హోం మినిస్టర్స్​ మెడల్​ ఫర్​ ఎక్స్​ లెన్స్​ ఇన్​ ఇన్వెస్టిగేషన్’ అవార్డుకు ఎంపిక చేసింది.

 అప్పట్లో ఆసిఫాబాద్​ జిల్లాలో విధులు నిర్వర్తించిన డీఎస్పీ ఆడెపు సత్యనారాయణ.. ప్రస్తుతం వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంతో పాటు తోటి ఆఫీసర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

19 రోజుల్లోనే ఛార్జ్​ షీట్​

నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మండలం మస్తాన్​ ఎల్లాపూర్​ గ్రామానికి చెందిన సమత(టేకు లక్ష్మీ), గోపి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఊరూరు తిరిగి బెలూన్స్​ అమ్ముతూ చిరు వ్యాపారం చేసుకునే ఈ దంపతులు.. ఆసిఫాబాద్​ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవారు. ఈ క్రమంలో 2019 నవంబర్​ 24న ఎప్పటిలాగే బెలూన్స్​ అమ్ముకునేందుకు ఇద్దరూ చెరో గ్రామానికి వెళ్లారు. భార్యను ఎల్లపటార్​ గ్రామంలో దింపిన గోపి.. ఆయన ఖానాపూర్​ వైపు వెళ్లాడు.

బెలూన్స్​ అమ్ముకున్న అనంతరం లక్ష్మిని స్థానిక లింగాపూర్​ జంక్షన్​ వద్ద ఉండాల్సిందిగా చెప్పాడు. ఆయన పని ముగించుకుని లింగాపూర్​ జంక్షన్ వెళ్లగా.. ఎంతసేపు చూసినా తన భార్య మాత్రం అక్కడికి రాలేదు. దీంతో ఆ పక్కనే ఉన్న గ్రామాల్లో వాకబు చేశాడు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో చివరకు లింగాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉంటే 25వ తేదీన ఉదయం సమీపంలోని రాములు నాయక్​ తండా శివారు చెట్ల పొదల్లో ఓ మహిళ మృతదేహం రక్తపు మడుగులో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ డెడ్​ బాడీ లక్ష్మీదేనని గుర్తించారు. అనంతరం జైనూరు సీఐ జువ్వాజీ సురేష్​, డీఎస్పీ సత్యనారాయణ విచారణ చేపట్టి, షేక్​ బాబు, షేక్​ షాబొద్దీన్​, షేక్​ ముఖ్దూం అనే ముగ్గురు నిందితులను నవంబర్​ 27వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. 

వారిని విచారించగా.. ఆమెను అత్యాచారం చేయడంతో పాటు గొంతు కోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం 24వ తేదీన కేసు నమోదు చేయగా.. డిసెంబర్​ 13న కోర్టులో ఛార్జ్​ షీట్​ దాఖలు చేశారు. కేవలం 19 రోజుల్లోనే ఛార్జ్​ షీట్​ దాఖలు చేయడంలో డీఎస్పీ సత్యనారాయణ సఫలీకృతం కాగా, ఆ తరువాత వాదోపవాదాలు విన్న ఆదిలాబాద్​ కోర్టు ముగ్గురు నిందితులకు మరణశిక్ష, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల ఫైన్​ కూడా విధించింది. తక్కువ సమయంలోనే దోషులకు శిక్ష పడేలా కేసును ఇన్వెస్టిగేషన్​ చేసిన డీఎస్పీ సత్యనారాయణను కోర్టు అభినందించగా.. దోషులకు శిక్ష పడటంతో స్థానికులు కూడా సంబరాలు చేసుకున్నారు.

ప్రత్యేక అవార్డుతో గుర్తింపు

దేశంలో వివిధ రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసులను సాల్వ్​ చేయడం, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్​ ఆఫీసర్లకు కేంద్ర ప్రభుత్వం హోం మినిస్టర్స్ అవార్డ్స్​ ను గురువారం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన దాదాపు 26 మందికి అవార్డులు దక్కాయి. ఇన్​వెస్టిగేషన్​ ఫీల్డ్​ విభాగంలో మొత్తంగా నలుగురు ఆఫీసర్లకు యూనియన్​ హోం మినిస్టర్స్​ మెడల్​ ఫర్​ ఎక్స్​ లెన్స్​ ఇన్​ ఇన్వెస్టిగేషన్​ అవార్డు దక్కగా.. అందులో వరంగల్ ఇంటెలిజెన్స్​ డీఎస్పీ సత్యనారాయణ ఒకరు కావడం గమనార్హం. ఇక స్పెషల్​ ఆపరేషన్స్ ఫీల్డ్​ విభాగంలో తెలంగాణకు చెందిన మరో 22 మందికి యూనియన్​ హోం మినిస్టర్స్​ అవార్డ్స్​ ప్రకటించడం విశేషం.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner