Farmers : తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, భూవివాదంతో ఇంకొకరు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం సోమయ్యకుంట తండాకు చెందిన కేతావత్ సంతోష్ (36), సరోజ దంపతులు.....అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కేతవాత్ సంతోష్ మృతి చెందాడు. భార్య సరోజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే జనగామ జిల్లా,చిల్పూర్ మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు వెంకటలక్ష్మి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని గత కొన్ని రోజులుగా రెవెన్యూ కార్యాలయం, అధికారులు,పోలీసులు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళా రైతు వెంకటలక్ష్మి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.
ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాకు చెందిన బానిత్ రందాన్, కమలమ్మ దంపతులు స్థానిక రైతుకు చెందిన 9 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. అయితే ఇప్పటికే రెండు సార్లు పత్తి గింజలు వేసినా మొలకెత్తలేదని, మనస్తాపంతో భార్య కమలమ్మ పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరేడు పల్లి మండలం జానకిరామ్ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య (45) అనే రైతు అప్పుల బాధతో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ లక్ష్మయ్య నిన్న మరణించాడు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు (32) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన ఆటో పాతది కావడంతో తరుచూ రిపేర్లు రావడంతో దాన్ని అమ్మి కొత్త ఆటో తీసుకున్నాడు. అయితే ఆటో గిరాకీ లేక ఆటో ఫైనాన్స్ కట్టలేక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేక నాగేంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆటో డ్రైబర్ నాగేంద్రబాబు కుటుంబాన్ని ఆటో డ్రైవర్లు సంఘం సభ్యులు పరామర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఆటో డ్రైవర్లకు ఈ గతి పడుతుందని నాగేంద్రబాబు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా