Warangal : రాష్ట్ర రెండో రాజధాని దిశగా ఓరుగల్లు, సీఎం పర్యటనకు ముందే సిటీపై వరాల జల్లు-warangal developed as second capital to telangana after hyderabad cm revanth reddy promised ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : రాష్ట్ర రెండో రాజధాని దిశగా ఓరుగల్లు, సీఎం పర్యటనకు ముందే సిటీపై వరాల జల్లు

Warangal : రాష్ట్ర రెండో రాజధాని దిశగా ఓరుగల్లు, సీఎం పర్యటనకు ముందే సిటీపై వరాల జల్లు

HT Telugu Desk HT Telugu
Nov 18, 2024 07:32 PM IST

Warangal : వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కుడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు భూసేకరణతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించింది.

రాష్ట్ర రెండో రాజధాని దిశగా ఓరుగల్లు, సీఎం పర్యటనకు ముందే సిటీపై వరాల జల్లు
రాష్ట్ర రెండో రాజధాని దిశగా ఓరుగల్లు, సీఎం పర్యటనకు ముందే సిటీపై వరాల జల్లు

రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కుడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు భూములు ఇచ్చిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ కోసం రూ.205 కోట్లతో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. ఆదివారం సాయంత్రం మరికొన్ని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ కేటాయించింది. దీంతో ఓరుగల్లు డెవలప్ మెంట్ వడివడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్ చేస్తామని హామీ ఇవ్వడం, అందుకు అనుగుణంగా వరంగల్ పర్యటనకు ముందే ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో ఓరుగల్లు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తరువాత రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూ.80 కోట్లు

వరంగల్ నగరం చుట్టూ దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ మేరకు గతంలోనే కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) ప్రతిపాదనలు తయారు చేసింది. కాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారి(ఎన్హెచ్–163)కి బైపాస్ గా దాదాపు 19 కిలోమీటర్ల మేర నగర శివారులోని కరుణాపురం నుంచి ఆరెపల్లి వరకు 2020లోనే రోడ్డు పూర్తి చేశారు. ఇంకో రెండు వైపులా రోడ్డు పూర్తయితే వరంగల్ కు పూర్తి స్థాయిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పడే అవకాశం ఉండగా.. కుడా ఆధ్వర్యంలో మొదటి దశలో ఖమ్మం రూట్ లోని నాయిడు పెట్రోల్ బంక్, వసంతపూర్, స్తంభంపల్లి, ఖిలా వరంగల్, జాన్ పీరీల వరకు దాదాపు 8 కిమీల మేర చదును చేసి పనులు చేపట్టారు. ఆ మార్గంలో ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉండటంతో దాదాపు రూ.113 కోట్ల వరకు పరిహారంగా చెల్లించి పనులు స్టార్ట్ చేశారు. ఇక రెండో దశలో జాన్ పీరీల నుంచి కీర్తినగర్, కోటి లింగాల, ఏనుమాముల, కొత్తపేట నుంచి ఆరెపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర కనెక్ట్ కావాల్సి ఉండగా.. భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. భూములు కోల్పోతున్న వారికి పరిహారం కోసం రూ.50 కోట్లు అంచనా వేయగా.. రైతులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. సర్వేల కోసం వెళ్లిన అధికారులను అడ్డుకుంటున్నారు. దీంతోనే భూనిర్వాసితులకు పరిహారం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.30 కోట్లు అదనంగా పెంచి, మొత్తంగా రూ.80 కోట్లు రింగ్ రోడ్డు కోసం రిలీజ్ చేసింది. దీంతో తొందర్లోనే ఈ పనులు కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టెక్స్ టైల్ పార్కు ముంపు నివారణకు రూ.160 కోట్లు

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు సమీపంలోని నాలాతో ముంపు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం దాని నివారణపైనా దృష్టి పెట్టింది. ఈ మేరకు గత జూన్ లో వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు ముంపు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నాలా రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి మొత్తంగా రూ.160 కోట్లు మంజూరు చేశారు. అందులో కేవలం రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.132.28 కోట్లు ఖర్చు పెట్టనుండగా.. ఇతర ఫినిషింగ్ పనులకు రూ.4.13 కోట్లు ఖర్చవనున్నాయి. కాగా మరో రూ.24.54 కోట్లు కేవలం జీఎస్టీ కే అవుతుండటం గమనార్హం. కాగా తొందర్లోనే ఈ పనులు స్టార్ట్ కానుండగా, వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు ముంపు ముప్పు తప్పనుందనే విషయం స్పష్టమవుతోంది.

జీడబ్ల్యూఎంసీ కొత్త బిల్డింగుకు రూ.32.5 కోట్లు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కొన్నేళ్ల కిందట నిర్మించగా.. ఇప్పుడది శిథిలావస్థకు చేరింది. దీంతో అక్కడి ఇండోర్ స్టేడియం ఎదుట కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు గతంలో ప్రపోజల్స్ పెట్టారు. మొత్తం నిర్మాణ పనులకు రూ.32.5 కోట్లు అవసరం కాగా.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు జీడబ్ల్యూఎంసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కోసం రూ.32.5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగును మొత్తంగా ఐదు అంతస్తుల్లో ఆధునిక హంగులతో నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేశారు.

మారుతున్న రూపురేఖలు

వరంగల్ నగరంలో ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా వరంగల్–కరీంనగర్ హైవే పై ఉన్న నయీంనగర్ నాలాతో దాదాపు 20 కిపైగా కాలనీలు ముంపునకు గురవుతుండగా.. సుమారు రూ.100 కోట్లతో నయీంనగర్ నాలా పనులు పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియా రూపు రేఖలే మారిపోయాయి. అంతేగాకుండా హనుమకొండ బాలసముద్రంలో దాదాపు రూ.95 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం కూడా ఓపెనింగ్ కు రెడీ అయ్యింది. దీంతో ఆ ఏరియా కూడా కొత్త కళను సంతరించుకుంది. వరంగల్ భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణంతో పాటు భద్రకాళి చెరువును కూడా డెవలప్ చేసే పనులు కొనసాగుతున్నాయి. తొందర్లోనే వరంగల్ లోని బొండివాగు నాల పనులు కూడా ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి భవనాలకు కూడా శిలాఫలకం వేయనున్నారు. ఇవన్నీ పనులు పూర్తయితే వరంగల్ నగరం కొత్త కళను సంతరించుకునే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో డెవలప్ చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక నేతలు చెబుతుండగా.. ఓరుగల్లు రాష్ట్ర రెండో రాజధానిగా అవతరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner