Warangal : కాంగ్రెస్ లో చేరిన వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ మార్నేని దంపతులు - సంబరాలు చేసుకున్నBRS లీడర్లు
Warangal DCCB Chairman Marneni Ravinder Rao: బీఆర్ఎస్ కు వరంగల్ డీసీసీబీ చైర్మన్ గుడ్ బై చెప్పారు. తన భార్య ఎంపీపీ మధుమతితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీని వీడటంపై స్థానిక బీఆర్ఎస్ లీడర్లు సంబరాలు చేసుకున్నారు.
Warangal DCCB Chairman Party Change: ఉమ్మడి వరంగల్ లో జిల్లాలో గులాబీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది పార్టీ ముఖ్య నేతలు కారు దిగి కాంగ్రెస్ వైపు అడుగులు వేయగా.. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, తన భార్య ఐనవోలు ఎంపీపీ మధుమతితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్లైంది. కాగా మార్నేని రవీందర్ రావు(Warangal DCCB Chairman Marneni Ravinder Rao) తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ కీలక నేతగా ఎదిగారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్(Aroori Ramesh) తో అంతర్గత విభేదాలు తలెత్తడంతో కొద్దిరోజుల కిందట నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటి ముట్టనట్టే ఉంటున్నారు. ఈ క్రమంలోనే మార్నేని రవీందర్ రావు పార్టీ మారుతున్నాడనే ప్రచారం జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు మార్నేని తో చర్చలు జరిపారు. అయినా సంతృప్తి చెందని ఆయన కారు దిగేందుకు సిద్ధపడ్డారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఆ పార్టీ పెద్దలతో టచ్ లో ఉంటూ వచ్చారు. గత టీడీపీ నుంచి ఉన్న సాన్నిహిత్యంతో వేం నరేందర్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.
దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలి: బీఆర్ఎస్ నేతలు
తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని(BRS Party) వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి, ఐనవోలు ఎంపీపి మధుమతి పదవులకు రాజీనామా చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, సొసైటీ చైర్మన్ వనం రెడ్డి, కార్పోరేటర్ ఇండ్ల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఐనవోలు మండల పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, కన్నతల్లి లాంటి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మార్నేని దంపతులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మీ పదవులు బీఆరెస్ పార్టీ పెట్టిన బిక్ష అని విమర్శించారు. టీడీపీలో రాజకీయ నిరుద్యోగిగా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మార్నేని మధుమతిని ఎంపీపీ గా గెలిపించారన్నారు. జిల్లా లోనే పెద్ద పదవి అయిన డిసిసిబి చైర్మన్ పదవి రవీందర్ రావుకు ఇచ్చారన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీలు మారుతున్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరూరి రమేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి పార్టీకి తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోరని, నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు పెట్టించి నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించారని ఆరోపించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు బాగుండాలని రాత్రిపగలు తేడాలేకుండా కష్టపడి పని చేసే నాయకుడికి మోసం చెయ్యాలనే బుద్ది ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పది సంవత్సరాలు పదవులు అనుభవించి రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడటం సిగ్గు చేటన్నారు.
సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ లీడర్లు
మార్నేని దంపతులు పార్టీని వీడటం హర్శించదగిన విషయమని, పది సంవత్సరాలుగా పార్టీలో పేరుకుపోయిన చెత్త బయటికి పోతుంటే నిజమైన కార్యకర్తలకు అభిమానులకు స్వాతంత్య్రం వచ్చినంత సంతోషం ఉందని బీఆరెస్ నేతలు గజ్జెల శ్రీరాములు, వలీ, ఇండ్ల నాగేశ్వరరావు తదితరులు అన్నారు. మార్నేని దంపతులు పార్టీ నుంచి వెళ్లిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తొడలు కొడతారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొడకొట్టి పార్టీ కోసం అభివృద్ది చేసిన నాయకుడి కోసం నిలబడే వారే నిజమైన కార్యకర్త అన్నారు. అలాంటి వారు వర్ధన్నపేట నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఉన్నారన్నారు. ఎవరూ ఎన్ని కుట్రలు చేసినా ఆరూరి రమేష్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో సంపాదించిన స్థానాన్ని ఎవరూ దూరం చెయ్యలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు వైస్ ఎంపిపి తంపుల మోహన్, సొసైటీ వైస్ చైర్మన్ బాబు, ఐలోని టెంపుల్ మాజీ ఛైర్మన్ జైపాల్ యాదవ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, అత్మ డైరెక్టర్లు రాజు, కట్లూరి రాజు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.