Warangal Abortions : లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్టరీత్యానేరం. అయినా వరంగల్ లో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు యథేచ్ఛగా లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రులపై నిఘా పెట్టిన వరంగల్ పోలీసులు... నర్సంపేట కేంద్రంగా జరుగుతున్న దందా గుట్టురట్టు చేశారు. లింగ నిర్ధారణ చేసి గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. నిందితుల నుంచి 18 సెల్ ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న లోటస్ ఆసుపత్రి యజమాని, పలువురు వైద్యులను అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున లింగ నిర్థారణలను జరుగుతున్నాయన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారని దర్యాప్తులో తెలిందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిని పట్టుకుంటామన్నారు. త్వరలోనే వైద్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ అన్నారు.
లింగ నిర్థారణ చేసి గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి.ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ అరెస్టైన వారిలో ఉన్నారన్నారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ దందా సాగుతోందని సీపీ తెలిపారు. లోటస్ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేసి స్కానింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నర్సంపేటకు చెందిన ఓ మహిళా వైద్యురాలు, నెక్కొండకు చెందిన డాక్టర్ తో పాటు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. నర్సంపేట, నెక్కొండ, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో గర్భ స్రావాలు జరిగినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. లింగ నిర్థారణ, గర్భస్రావాలకు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణులను లింగ నిర్ధారణ పరీక్షల కోసం నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాలో సుమారు 200 మందికి అబార్షన్లు చేయించి ఉంటారని తెలుస్తోందన్నారు.