చిచ్చురేపిన 'కొండా మురళీ' కామెంట్స్..! తారా స్థాయికి విబేధాలు, ఏం జరగబోతుంది..?-warangal congress leaders are serious about konda murali comments ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చిచ్చురేపిన 'కొండా మురళీ' కామెంట్స్..! తారా స్థాయికి విబేధాలు, ఏం జరగబోతుంది..?

చిచ్చురేపిన 'కొండా మురళీ' కామెంట్స్..! తారా స్థాయికి విబేధాలు, ఏం జరగబోతుంది..?

ఓరుగల్లు కాంగ్రెస్ లోని నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీకి చెందిన కొండా మురళీ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. మురళీ చేసిన వ్యాఖ్యలపై జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీరియస్ అవుతున్నారు. ఇవాళ నేతలంతా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఓరుగల్లు కాంగ్రెస్ లో విభేదాలు..!

వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ… కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. అంతేకాదు… కొండా మురళీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పలువురు నేతలు… ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ ఊరుకోదంటూ సదరు నేతలు… కొండాను హెచ్చరించారు. సీనియర్ నాయకులు అనే ఇంకితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే…?

గురువారం వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌లో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇందులో పార్టీ నేత కొండా మురళీ మాట్లాడుతూ… తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో పదవులు అనుభవించారని… ఆ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్‌ల వద్దకు చేరి తప్పుదోవ పట్టించి… వారినీ కూడా నాశనం చేశారన్నారు. వారిలో ఒకరు గతంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. పరకాల నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి… ఎన్నికల సమయంలో నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకున్నారని చెప్పుకొచ్చారు. బయటి పార్టీలో నుంచి వచ్చిన వాళ్లు రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె సుష్మితా పరకాల నుంచి బరిలో ఉంటుందని స్పష్టం చేశారు.

నేతల ప్రత్యేక భేటీ…

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కార్యాలయంలో వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, బస్వరాజు సారయ్య, గుండు సుధారాణితో పాటు మరికొంత మంది నేతలు హాజరయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. మురళీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీసీ కార్డు అడ్డుపెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని కొండా మురళీని ఉద్దేంచి… వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్నారు. సీనియర్ నాయకులు అనే ఇంకితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నేతలైనా పార్టీ నిబంధనలకు లోబడి పని చేయాలని హితవు పలికారు. ఇలాంటి విధానం సరికాదని సూచించారు. అధినాయకత్వం… ఈ విషయాలన్నింటిపై దృష్టి పెట్టాలని కోరారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్కతో పాటు కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. అయితే పలుమార్లు సురేఖ తీరు కూడా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే చర్చ కూడా జరిగింది. తాజాగా ఆమె భర్త అయిన కొండా మురళీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.