మీ ఇంట్లో ఎవరైనా మైనర్లు బండ్లు నడుపుతున్నారా….? లైసెన్స్ లేని మేజర్లకైనా బండ్లు ఇచ్చి బయటకు పంపిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మైనర్ డ్రైవింగ్ తో పాటు లైసెన్స్ లేని వాహనదారులపై వరంగల్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మైనర్లు వెహికిల్స్ నడిపినా.. వారిని ప్రోత్సహిస్తూ వెహికిల్స్ అందజేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి నుంచి స్పెషల్ డ్రైవ్స్ స్టార్ట్ చేసి, మైనర్లు, లైసెన్స్ లేకుండా వెహికిల్స్ నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో చాలా వరకు స్వయం తప్పిదాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్లకు బండ్లు ఇవ్వడం వల్ల ఓవర్ స్పీడ్ తో నడుపుతుండటం, లైసెన్స్ లేని వాళ్లు కనీసం ట్రాఫిక్ నియమాలు తెలియకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు.
దీంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా తెలిసీ తెలియని వయస్సులోని మైనర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో అలాంటి ప్రమాదాల నివారణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన చర్యలు చేపడుతున్నారు.
మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. అంతేగాకుండా వాహనం నడిపినందుకు గానూ సదరు మైనర్‌ను కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి అదేశాల మేరకు అబ్జర్‌వేషన్ హోంకు పంపిస్తున్నారు. అలాగే వాహన యజమాని లేదా వాహనం నడిపిన మైనర్ తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు 63 మంది మైనర్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఘటనల్లో మొత్తం 35,278 కేసులు నమోదు చేశారు. 12,552 వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు వాహనం ఇచ్చిన యజమానులకు 16 లక్షల 47 వేల రూపాయల జరిమానా కూడా విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలను అందజేసే చిక్కుల్లో పడొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనం అందజేయడం కూడా నేరమని, ఒక వేళ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు బండి యజమానికి కూడా జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
ముఖ్యంగా మైనర్లు వాహనం నడుపుతూ ఏదైనా ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే, మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన యజమానికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా 25 వేల రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.
పోలీసులకు పట్టుబడిన మైనర్లు 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కోల్పోతాడని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. పట్టుబడిన వాహనం రిజిస్ట్రేషన్ ఒక సంవత్సర కాలం రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి వాహనాలను అందజేసి చిక్కుల్లో పడవద్దని పోలీస్ కమిషనర్ సూచించారు.