warangal collector: వరంగల్ కలెక్టర్ సత్య శారద.. అందరికీ ఆదర్శం
warangal collector: ప్రస్తుతం చాలా హాస్టళ్లలో అనేక సమస్యలున్నాయి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ.. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాత్రం అలా కాదు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తూనే.. వారిని ప్రోత్సహిస్తున్నారు.
వరంగల్ కలెక్టర్ సత్య శారద ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అంతేకాదు.. నేలపైనే కూర్చొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం బాగుందని.. ఇలాగే కంటిన్యూ చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఆదేశించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం మెనూను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల చదువు, వసతి, సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వద్దని గట్టిగా చెప్పారు. కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద భాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధ్యులు వచ్చే ప్రమాదం ఉందని.. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్‌సీకి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటనలతో.. అన్ని శాఖల అధికారులు అలెర్ట్ అయ్యారు.
నెలకోసారి ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలి..
తాజాగా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో తనిఖీలు చేయాలని సూచించారు. నెలకు ఒకసారి.. కలెక్టర్లు రెసిడెన్షియల్స్, హాస్టల్స్‌లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని సూచించారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేస్తే.. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని.. అప్పుడే విద్యార్థుల సమస్యలు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.