T Congress MLAs Meeting : 'నా ఫొటో ఉంటే చూపండి, రాజకీయాలనే వదిలేస్తా' - వరంగల్ సిటీ ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే
Telangana Congress MLAS Meeting : ఎమ్మెల్యేల భేటీ అంశం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీలో తాను పాల్గొనట్లు వస్తున్న వార్తలపై వరంగల్ సిటీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భేటీ అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భేటీలో పాల్గొన్నది ఎవరనే అంశం పక్కనపెడితే… దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆహ్వానంతో కొందరు సమావేశయ్యారని.. మరోసారి కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కూడా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆయన.. ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు.

ఫొటోను బయటపెట్టండి - నాయిని
కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులపై అసమ్మతిగా ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. నా ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నాను. నిజంగానే నేను భేటీకి వెళ్తే… ఒక్క ఫొటోనైనా బయటపెట్టండి. అలా చేస్తే రాజకీయాల నుంచే వైదొలుగుతాను” అంటూ నాయిని కామెంట్స్ చేశారు.
విచారణ కోసం లేఖ రాశా…
ఈ ప్రచారం వెనక కొన్ని పార్టీలు ఉన్నాయని నాయిని ఆరోపించారు. “వారు సంపాదించిన అక్రమ సంపాదనతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోడిగుడ్డుపై ఇకలు పీకే చర్యలను మానుకోవాలి. అయినా సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముంది. వారేమైనా బిఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా…? దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. దుష్ప్రచారం వెనక ఉన్నవాళ్లను తప్పకుండా శిక్షించాలి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశాను. ఆధారాలు లేకుండా వార్తలు రాసిన యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువు నష్టం దాఖలు చేస్తున్నాను” అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే భేటీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అలజడిని సృష్టించినట్లు అయింది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్‌లో వీరు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కేబినెట్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు.. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పార్టీలోని కీలక నేతలు స్పందిస్తూ… పార్టీ ఎమ్మెల్యేల భేటీని ధ్రువీకరిస్తున్నారు. రహస్యంగా భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు.