Aswaraopet SI : అశ్వారావుపేట ఎస్సై మరణ వార్త విని మేనత్త మృతి-ఎస్సై మరణ వాంగ్మూలం వైరల్-warangal aswaraopet si aunt died with heart stroke after knows si death news narakkapet village in high alert ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aswaraopet Si : అశ్వారావుపేట ఎస్సై మరణ వార్త విని మేనత్త మృతి-ఎస్సై మరణ వాంగ్మూలం వైరల్

Aswaraopet SI : అశ్వారావుపేట ఎస్సై మరణ వార్త విని మేనత్త మృతి-ఎస్సై మరణ వాంగ్మూలం వైరల్

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 04:06 PM IST

Aswaraopet SI : ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ మరణవార్త విని ఆయన మేనత్త గుండెపోటుతో మరణించారు.

అశ్వారావుపేట ఎస్సై మరణ వార్త విని మేనత్త మృతి-ఎస్సై మరణ వాంగ్మూలం వైరల్
అశ్వారావుపేట ఎస్సై మరణ వార్త విని మేనత్త మృతి-ఎస్సై మరణ వాంగ్మూలం వైరల్

Aswaraopet SI : దాదాపు వారం రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట కాగా.. ఆయన మృతి నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నారక్కపేటలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీనివాస్ కు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు సంతానం కాగా.. దళిత, వామపక్ష, ప్రజాసంఘాల నుంచి ఆందోళనలు వెళ్లువెత్తకుండా కొన్ని చోట్ల పోలీసులు ముందస్తుగా కొంతమంది నేతలను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్సై మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉండగా.. ఉదయం నుంచే గ్రామంలో పోలీసులు ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పహారా కాస్తున్నారు. కాగా ఎస్సై శ్రీనివాస్ మరణ వార్త తెలియడంతో ఆయన మేనత్త, దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన దార రాజమ్మ(60) గుండె నొప్పితో ఆదివారం ఉదయం 11 గంటల సుమారులో మరణించింది. దీంతో నాచినపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.

వైరల్ గా మారిన ఎస్సై వాంగ్మూలం

అశ్వారావుపేట ఎస్సై గా పని చేస్తున్న శ్రీరాముల శ్రీను వారం రోజుల కిందట సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపగా.. సీరియస్ గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడి సీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. సీఐ జితేందర్ రెడ్డి ఐజీ కార్యాలయానికి, నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కులం పేరుతో తన భర్తని వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారందరిపై కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు ఎస్సై శ్రీనివాస్ వాంగ్మూలం సేకరించారు. అందులో స్టేషన్ లో పని చేస్తున్న ఏపీకి చెందిన నలుగురు కానిస్టేబుళ్ల పేర్లను ప్రస్తావిస్తూ వారు తనకు సహకరించకపోయే వారని, వారిలో వారు గొడవ పెట్టుకుని తనను ఇబ్బందులకు గురి చేసే వారని వాంగ్మూలంలో ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాగా ఒక నిమిషం నిడివి కలిగిన ఎస్సై శ్రీనివాస్ వాంగ్మూలం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా తమ ప్రాంతానికి చెందిన ఎస్సై కావడంతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, చివరకు దళిత ఉద్యోగులకు కూడా న్యాయం జరగక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు రాష్ట్రంలో ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందాడని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీనివాస్ మృతి అని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలన్నారు. ఎస్సై శ్రీనివాస్ మృతికి గల కారణాలపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని, బాధ్యులైన పైస్థాయి అధికారులను కూడా గుర్తించి తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు రక్షించాల్సిన పోలీసులకే రాష్ట్రంలో రక్షణ లేకుండా వారు ఆత్మహత్యలకు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. దళిత ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం